Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం, నిశ్చితార్థానికి వెళ్తుండగా బస్సు బోల్తా, 10మందికి గాయాలు!
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
Chittoor Accident: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్(Bhakarapeta) రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం(Bus Accident) మరవకముందే అదే జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నిశ్చితార్థానికి వెళ్లుండగా ఐతేపల్లి సమీపంలో మినీ బస్సు బోల్తా పడింది. ట్రాక్టర్(Tractor) ను ఢీ కొని పక్కనే ఉన్న మామిడి తోటలో మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, మరో 17 మందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను తిరుపతి(Tirupati) రుయా ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట నుంచి దామలచెరువు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐతేపల్లి నుంచి దామలచెరువులో నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు ఐతేపల్లి, తిరుపతి చింతలచేనుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె - తిరుపతి జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులోపెళ్లి బృందం బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి చిత్తూరు జిల్లా తిరుపతికి వెళ్తుండగా మలుపు వద్ద ప్రైవేట్ బస్సులో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. మొదట ఆరుగురు చనిపోగా, నారావారిపల్లె పీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొదుతూ చిన్నారి చనిపోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య 8 కి పెరిగింది. తాజాగా మరో వ్యక్తి చనిపోయారు.
బస్సులో మొత్తం 50 మంది వరకు ప్రయాణిస్తుండగా.. పెళ్లి కొడుకుతో పాటు 45 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రైవేట్ బస్సు లోయలో పడ్డ ఈ ప్రమాదంలో డ్రైవర్ నబీ రసూల్, మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి గణేశ్ (40), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40), జె.యశస్విని(8), ట్రావెల్స్ క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని తిరుపతి రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
ప్రధాని మోదీ దిగ్బ్రాంతి
ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫంక్షన్‌కు వెళ్తున్న వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మన్ కీ బాత్ లో మాట్లాడుతూ ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందజేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.