Chittoor News : టెన్త్ పేపర్ల లీకేజీ కేసు, నారాయణపై పెట్టిన సెక్షన్లు ఇవే!
Chittoor News : పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో కోర్టు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
Chittoor News : పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల మాజీ అధినేత నారాయణకు చిత్తూరు జిల్లా న్యాయస్థానం బెయిల్ రద్దు చేసిందని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022వ సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేస్తూ చిత్తూరు నాల్గో అదనపు న్యాయస్థానం న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల సమయంలో నేల్లెపల్లి జడ్పీ హైస్కూల్ లో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై చిత్తూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 27వ తేదిన Cr. No. 111/2022 u/s 5 r/w 8, 10 కింద 408, 409, 201, 120 –B IPC & Sec. 65 of IT Act of Chittoor I Town P.S. కేసు నమోదు చేసి, దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, నారాయణ విద్యా సంస్థలలో పని చేసే సిబ్బంది 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే ఈ కేసులో మే 10న నారాయణ విద్యా సంస్థల మాజీ అధినేత పి. నారాయణను అరెస్టు చేసిన చిత్తూరు ఒకటో పట్టణ పోలీసులు జడ్జి ఎదుట హాజరు పరచారని, కేసు దర్యాప్తును పరిశీలించిన జడ్జి నారాయణతకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారని తెలియజేశారు.
బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు
ఈకేసులో మిగిలిన ఎనిమిది మంది ముద్దాయిలను రిమాండ్ కు తరలించామని ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో నారాయణ బెయిల్ రద్దుపై పోలీసులు 9వ అదనపు న్యాయస్థానంలో పిటిషన్ ఫైల్ చేసి వాదనలు వినిపించారన్నారు. ఈ వాదనలపై విచారణ జరిపిన 9వ అదనపు న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ 4వ అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారన్నారు. అయితే నవంబర్ 30వ తారీఖు లోపు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా గిరిధర్ రెడ్డి ఉండగా, సుధాకర్, మోహన్ బాబు,అరీఫ్ బాషా, సురేష్ బాబు, పవన్ కుమార్, గంగాధర్ రావు, నారాయణలు ముద్దాయిగా ఉన్నట్లు చిత్తూరు ఎస్పి రిశాంత్ రెడ్డి తెలియజేశారు.
చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పేపర్లు
ప్రతి ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో ర్యాంకుల కోసం ప్రైవేటు యాజమాన్యాలు పోటీ పడుతుంటారు. ఎలాగైనా తమ కళాశాల విద్యార్థులు అధిక శాతం మార్కులు సాధించి నెంబర్ వన్ లో నిలవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెండేళ్ల తరువాత ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో తమ పాఠశాల విద్యార్థులు అధిక మార్కులు సాధించాలని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు అడ్డదారిలో మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ పేపర్ల ఫొటోలు తీసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడుతూ చిత్తూరు టాకీస్ మీడియా గ్రూప్ లో పోస్టు చేశారు. ఈ ఘటనపై చిత్తూరు డీఈవోకి అందిన ఫిర్యాదుతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు మాల్ ప్రాక్టీసుకు కారకుడైన నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు.