Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, తల్లీ కొడుకు మృతి!
Road Accident: చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమారులు మృతి చెందగా.. భర్త, కుమార్తె స్వల్పంగా గాయపడ్డారు. స్నేహితుడిని కలిసి వస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం, మామడుగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరుకు చెందిన వెంకట్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం తమిళనాడు రాష్ట్రం వేలూరులోని స్నేహితుడిని కలిసి కుటుంబంతో సహా బెంగుళూరుకు తిరుగు ప్రయణం అయ్యారు. ఈ క్రమంలోనే గంగవరం మండలం, మామడుగు వద్ద జాతీయ రహదారిపై కారు ఎడమ వైపు ముందు టైరు పేలిపోయింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.
తల్లితో పాటు మూడేళ్ల కుమారుడి మృతి..!
ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చున్న భార్య గాయత్రి(30), 3 సంవత్సరాలు కుమారుడు విథున్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. భర్త వెంకట్, కుమార్తె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులనుసరుక్షితంగా కారులోంచి బయటకు దింపారు. ఆ తర్వాత పోలీసులకు సమాచాంర అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడ స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గంగవరం ఎస్సై సుధాకర్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాగే టైరు పేలి నిజమాబాద్ లో నలుగురు మృతి..!
హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తోంది ఓ కారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బైపాస్ కొత్త పల్లి వద్దకు రాగానే.. కారు టైరు ఒక్కసారిగా పేలింది. అనుకోని ఘటనతో కారు అదుపు తప్పింది. కారు వేగంగా వెళ్తుండటం, అదే సమయంలో టైరు పేలడంతో కారు బోల్తా పడి, రెండు మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉండే రెయిలింగ్ కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ దుర్ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరిని కలిచి వేస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు పిల్లలు కాగా మరో ముగ్గురు పెద్ద వాళ్లు. టైరు పేలడంతో కారు పల్టీలు కొట్టి రెయిలింగ్ కు బలంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
కారు ప్రమాదం ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారు, క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టోలిచౌకికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముప్కాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.