Kuppam News : పొలం దారి సమస్య, సచివాలయంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం!
Kuppam News : పొలానికి దారి సమస్య పరిష్కరించడంలేదని సచివాలయంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు.
Kuppam News : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల సచివాలయంలో టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశారు. చెంగుబళ్ల పంచాయతీ మాజీ సర్పంచ్ గోపాల్ తన పొలానికి దారి సమస్య పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించారు. వినతులు స్వీకరించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని గోపాల్ ఆరోపిస్తున్నారు. వారం రోజుల కిందట రెవెన్యూ డివిజన్ అధికారికి విన్నవించిన గోపాల్.. ఆర్డీవో కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం క్షేత్ర పరిశీలన చేపట్టిన అధికారులు సమస్యను మాత్రం పరిష్కరించలేదు. దీంతో అధికారుల తీరుపై ఆవేదన చెందిన గోపాల్.. సచివాలయంలో తాడుతో ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు.
లాడ్జ్ లో యువతి, యువకుడు సూసైడ్
తిరుపతిలోని ఓ లాడ్జ్ లో యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజస్వామి ఆలయ ఉత్తరమాడవీధిలోని ఓ ప్రైవేట్ లాడ్జ్ కు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో యువతి, యువకుడు వచ్చారు. లడ్జ్ లో రూమ్ తీసుకున్న వీరిద్దరూ 24 గంటలు గడిచినా బయటకు రాకపోవడంతో లాడ్జ్ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరూ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం మృతులు హైదరాబాద్ కు చెందిన కృష్ణారావు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
వేటగాళ్లు అరెస్టు
చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి వేటగాళ్ల ఆగడాలు హద్దులు మీరుతున్నాయి. అటవీ ప్రాంతంలోని వన్య ప్రాణులను సంహరించి పైశాచికత్వంను పొందుతున్నారు. తాజాగా కినాటకంపల్లె అటవీ ప్రాంతంలో చిరుత పులిని నాటు తుఫాకీతో వేటాడిన వేటగాళ్లు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో రంగంలోకి దిగిన చిత్తూరు అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిపై అటవీ శాఖ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. నిందుతుల వద్ద నుండి చిరుత పులి గోర్లు, రెండు నాటు తుఫాకీలు, మూడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా, యాదమర్రి మండలం, కినాటంపల్లె అటవీ ప్రాంతంలో రెండేళ్ల క్రితం చిరుత పులిని కొందరు వ్యక్తులు వేటాడి సంహరించిన ఫోటోలు గత మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో కలకలం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, తీగ లాగితే డొంక కదిలినట్లు అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను సంహరించే ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు ఫారెస్టు డిఏఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వెల్లడించారు.