Crime News: శ్రీకాకుళం జిల్లాలలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు- పరుగులు పెడుతున్న పోలీసులు
శ్రీకాకుళం జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు కేసులు రిజిస్టర్ అవ్వడం టెన్షన్ పెడుతోంది. ఇది కచ్చితంగా ఒడిశా బ్యాచ్ పని అయిఉంటుందని అనుమానిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వరుసగా చైన్ స్నాచింగ్‌లు పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలలో దొంగలు రెచ్చిపోయారు. మహిళల మెడలోని బంగారు ఆభరణాలు లాక్కొని పరారవుతున్నారు. బైక్‌లపై వస్తూ మహిళలను వెనుక నుంచి వెంబడించి చైన్ స్నాచింగ్‌లకి పాల్పడుతున్నారు. సరిహద్దులు దాటేస్తున్నారు. జిల్లాలో ఇటీవల వరుసగా ఈ సంఘటనలు జరుగుతున్న తీరు గమనిస్తే పథకం ప్రకారమే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా అర్థమవుతుంది.
సరిగ్గా రెండు నెలల క్రితం మే19న జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని నిత్యం రద్దీగా ఉండే సూర్యమహల్ జంక్షన్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు పని కానిచ్చేసి జారుకున్నారు. అందరూ చూస్తుండగానే బండిపై వెళ్తున్న రాధాకుమారి అనే మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు, నల్లపూసల గొలుసు తెంచుకుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. స్నాచింగ్ దృశ్యాలు సమీపంలోని సిసి కెమెరాలలో కూడా రికార్డు అయ్యాయి.
అదేరోజు అరసవల్లి రోడ్డులో కూడా స్నాచింగ్‌కి దుండగులు ప్రయత్నించగా మహిళలు కేకలు వేయడంతో అక్కడ నుంచి జంప్ అయ్యారు. అదే రోజు ఇచ్చాపురంలోని మార్కెట్ నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న క్రమంలో పైల సరస్వతి మెడలోని బంగారు గోలుసుకుని స్నాచర్లు తెంపుకుని పరారయ్యారు. ఆ బాధితురాలు ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అదే రోజు ఒడిశా బరంపురంలో కూడా స్నాచింగ్ కేసు నమోదైంది. శ్రీకాకుళం నుంచి బరంపురం వరకూ అవకాశం దొరికిన చోట స్నాచర్లు తమ చేతికి పని చెప్పుకుంటూ సరిహద్దులను దాటి వెళ్ళిపోయారు.
అదే రీతిలో జులై 22న మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లాలోని పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం మండలాల్లో స్నాచింగ్‌లకి పాల్పడ్డారు. పాతపట్నం మండలంలోని అచ్చుతాపురంలో సిరిపురం జయలక్ష్మీ అనే మహిళను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడు తెంచుకుని వెళ్లిపోయారు. ఆ మహిళ పాతపట్నం పోలీసులకి ఫిర్యాదు చేశారు. టెక్కలికి చెందిన సూరకుమారి అనే మహిళ ఎస్టిఓ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా పుస్తెలతాడు తెంచుకుని పారిపోయారు. ఆమె కూడా టెక్కలి పోలీసులకి ఫిర్యాదు చేశారు.
ఇచ్చాపురం మండలంలోని సన్యాసిపుట్టుగవాసి దేవమ్మ పోలాకి వెళ్ళి తిరిగివస్తుండగా బంగారం గొలుసు తెంచుకుని స్నాచర్లు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇచ్చాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఒకే రోజు జరిగిన ఈ మూడు స్నాచింగ్లు ఒకే రీతిలో జరిగాయి. ఒంటరి మహిళలే లక్ష్యంగా బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్నాచింగ్లకి పాల్పడ్డారు. ఒకే బ్యాచ్ ఈ స్నాచింగ్లకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్నాచర్ల కోసం ప్రత్యేకంగా పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ఒడిశా బ్యాచ్ ల పైనే అనుమానాలు
జిల్లాలో స్నాచింగ్లకి పాల్పడుతున్న బ్యాచ్లు ఒడిశా ప్రాంతానికి చెందినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లాలో ఏదోక ప్రాంతంలో స్నాచింగ్లు ప్రారంభించి వరుసగా ఇచ్చాపురం వరకూ దొరికిన చోట గొలుసులను తెంచుకుంటూ ఇచ్చాపురం మీదుగా సరిహద్దులు దాటేస్తున్నట్లుగా భావిస్తున్నారు. పథకం ప్రకారం వారు ద్విచక్ర వాహనాలపై జిల్లాలోకి ప్రవేశించి ఏదొక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని అక్కడ నుంచి తిరిగి వెళ్ళే లోపల చేతులకు పనిచెప్పుకొని పరారవుతున్నట్లుగా గుర్తించారు. హెల్మెట్ లు ధరించడంతోపాటు మాస్క్‌లను పెట్టుకుని పోలీసులకి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కన్పిస్తోంది.
జిల్లాలో రెండు నెలల వ్యవధిలో వరుసగా జరిగిన స్నాచింగ్ ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కేవలం ఈజీ మనీకి అలవాటు పడ్డ కుర్ర బ్యాచ్లు ఈ చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్నట్లుగా భావిస్తున్నారు. పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఒడిశాలో ఏ ప్రాంతానికి చెందిన వారు ఇటువంటి నేరాలకు పాల్పడుతుంటారన్న దానిపై కూడా పోలీసులు వివిధ కోణాలలో ఆరా తీస్తున్నారు. త్వరలోనే నింధితులను పట్టుకునేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా ఈ కేసులలో దర్యాప్తును నిర్వహిస్తున్నారు.
భయపడుతున్న మహిళలు జిల్లాలో స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకుంటుండడంతో మహిళలు ఒంటరిగా రోడ్ల మీదకి వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రధానంగా నిర్మానుష్య ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు హడలిపోతున్నారు. నడుచుకుని వెళ్తున్న వారి మెడలలో నుంచే కాకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి మెడలలో నుంచి పుస్తెలు తెంపేస్తుండటంతో కంగారు పడుతున్నారు.