Vizag Drugs : విశాఖలో సీబీఐ ఆపరేషన్ గరుడ - పోర్టులో వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం !
Drugs Case : విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. దీని విలువ కొన్ని వేల కోట్లు ఉంటందని అంచనా
Crime News : బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకు వచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సీబీఐ అధికారులకు మైండ్ బ్లాంక్ అయింది. ఏకంగా పాతిక వేల కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోవడానికి.. ఈ రాకెట్ ను చేధించడానికి ఆపరేషన్ గరుడ ను సీబీఐ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిఘా పెట్టినప్పుడు విశాఖ పోర్టుకు పెద్ద ఎత్తున డ్రగ్స్ పంపిస్తున్నట్లుగా సమాచారం తెలిసింది. దీంతో నిఘా పెట్టిన సీబీఐ అధికారులు షిప్ వైజాగ్ పోర్టుకు రాగానే పట్టుకున్నారు.
డ్రగ్స్ కంటెయినర్‌ను బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టులో బుక్ చేసుకున్నారు. విశాఖ పట్నంలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కంపెనీ ఈ కన్‌సైన్ మెంట్ అందుకోవాల్సి ఉంది. బీర్‌ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను ఎగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారు. ఒక్కో బ్యాగులో ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తం వెయ్యి బ్యాగుల్లో ఇరవై ఐదు వేల కేజీల సరుకును పంపినట్లుగా పత్రాల్లో ఉంది. నార్కోటిక్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు.. ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బీరు తయారు చేసే గింజలతో పాటు పెద్ద ఎత్తున ఇతర డ్రగ్స్ పదార్దాలును కూడా సరఫరా చేసినట్లుగా గుర్తించారు. మొత్తం కన్ సైన్ మెంట్ ను సీబీఐ అధికారులు సీజన్ చేశారు. కేసు నమోదు చేశారు. సరుకును తెప్పించుకున్న వారిపైనా.. ఈ స్మగ్లింగ్ లో భాగం అయి గుర్తు తెలియని వ్యక్తులపైనా కేసులు పెట్టారు.
ఈ ఆపరేషన్ గరుడ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ రాకెట్‌ను ..ముఖ్యంగా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నట్లుగా సీబీఐ చెబుతోంది. ఇతర పదార్థాలతో కలిసి ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ.. ఈ అంతర్జాతీయ ముఠా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఇంటర్ పోల్ అందించిన సమాచారంతో సీబీఐ.. ఇలాంటి తఆపరేషన్లను తరచూ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ముఠాల ఆట కట్టించడానికి ఎప్పుడూ ప్రత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
విశాఖ పోర్టులో గతంలో డ్రగ్స్ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ లభించలేదు. మొదటి సారి దొరికాయా లేకపోతే.. ఇంతకు ముంద విశాఖ పోర్టు ద్వారా సిటీలోకి ఏమైనా డ్రగ్స్ వచ్చేశాయా అన్నదానిపై వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే గంజాయి .. విశాఖ మన్యం ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అవుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏకంగా బ్రెజిల్ నుంచి వేల కిలోల డ్రగ్స్ నేరుగా విశాఖకే దిగుమతి కావడం.. సంచలనం అవుతోంది.