Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Crime News: బెంగళూరులో పీజీలో యువతి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. అత్యంత దారుణంగా గొంతుకోసి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengaluru Woman Murder: బెంగళూరులో ఓ హాస్టల్‌లో యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. పీజీలో ఉంటున్న యువతిని చంపేందుకు పక్కా ప్లాన్‌తో వెళ్లిన నిందితుడు ఆమె లోపలి నుంచి బయటకు వచ్చీ రాగానే దాడి చేశాడు. రూమ్ డోర్ ముందే దారుణంగా కత్తితో గొంతు కోశాడు. వద్దని బతిమాలుతున్నా వదలకుండా జుట్టు పట్టుకుని లాగి మరీ దాడి చేశాడు. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ సంచలనం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. చివరిసారి మధ్యప్రదేశ్‌లో మొబైల్ సిగ్నల్ కనిపించింది. ఆ తరవాత స్విచాఫ్ అయింది. ఈ సిగ్నల్‌ని ట్రాక్ చేసిన పోలీసులు మధ్యప్రదేశ్‌లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు కృతి కుమారి బెంగళూరులోని కోరమంగళలోని పీజీలో ఉంటోంది. ఈ నెల 23వ తేదీన రాత్రి 11 గంటలకు ఓ యువకుడు ఆమె రూమ్‌కి వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. ఆమె బయటకు వచ్చిన వెంటనే గట్టిగా పట్టుకుని దాడి చేశాడు. ఆ తరవాత కత్తితో గొంతుని అత్యంత దారుణంగా కోశాడు.
కారణమిది..
ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం కృతి కుమారితో పాటు మరో యువతి పీజీలో ఉంటోంది. ఈ యువతికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. యువకుడికి ఉద్యోగం ఏమీ లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవి. ఇలా గొడవలు పడడం కన్నా విడిపోవడం మంచిదని ఫ్రెండ్‌కి సలహా ఇచ్చింది కృతి కుమారి. ఈ కారణంగానే కృతిపై యువకుడు కక్ష పెంచుకున్నాడు. తరవాత దారుణంగా హత్య చేశాడు. దాడి చేయబోతుండగా ఆ యువతి తనను తాను విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించింది. ఆ సమయంలోనే ముఖంపై పదేపదే పిడిగుద్దులు గుద్దాడు. ఆ తరవాత కత్తితో పదేపదే పొడిచాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.