Bangladesh Train Accident: క్రాసింగ్ వద్ద టూరిస్ట్ వాహనం, రైలు ఢీ - 11 మంది దుర్మరణం, 5 మందికి గాయాలు
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లోని ఓ క్రాసింగ్ వద్ద మైక్రోబస్‌ను రైలు ఢీకొనడంతో 11 మంది మృతి చెందగా, 5 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ఈ విషాదం జరిగింది.
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. క్రాసింగ్ వద్ద ప్రయాణికుల వాహనాన్ని రైలు ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరియు ఐదుగురు గాయపడ్డారు. బంగ్లాదేశ్ లోని చటోగ్రామ్ జిల్లాలో రైలు క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వాహనాలు ఢీకొట్టుకోవడం, రైళ్లు ఢీకొనే ఘటనలు అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కానీ రైలు క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యం వల్ల బంగ్లాదేశ్ లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అసలేం జరిగిందంటే..
చటోగ్రామ్ జిల్లాలో క్రాసింగ్ వద్ద ఢాకా నుంచి వెళ్లే ప్రోబతి ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం నాడు వేగంగా దూసుకెళ్తోంది. అంతలోనే కొందరు ప్రయాణిస్తున్న ఓ మినీ బస్ లాంటి వాహనం రైలు వస్తున్నా, క్రాసింగ్ ను దాటేందుకు యత్నించింది. ఈ క్రమంలో రైలు, మినీ బస్ ఢీకొనడంతో విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో తొమ్మిది మంది ప్రయాణికులను ఇప్పటి వరకు పోలీసులు గుర్తించారు. సరదా కోసం విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులతో పాటు టీచర్లు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విచారకరం.
కోచింగ్ సెంటర్ విద్యార్థులు, స్టాఫ్..
మినీ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా అమన్ బజార్ ప్రాంతంలోని 'ఆర్ అండ్ జే ప్లస్' కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అని పోలీసులు తెలిపారు. రైలు వస్తున్న సమయంలో క్రాసింగ్ గేట్ ఓపెన్ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖైయాచారా రైల్ గేట్ మ్యాన్ సద్దాం హుస్సేన్‌ను రైల్వే పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని హతజారీ ఉపజిల్లా నిర్బాహి అధికారి షాహిదుల్ ఆలం తెలిపారు.
విహారయాత్రలో విషాదం..
'ఆర్ అండ్ జే ప్లస్' కోచింగ్ సెంటర్ విద్యార్థులు, టీచర్లు మిర్షారై కొండలలోని ఖోయాచోరా జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. వాటర్ ఫాల్స్ చూసి, తిరిగి వస్తుండగా ఢాకా వెళ్లే ప్రోబతి ఎక్స్‌ప్రెస్ రైలు వీరు ప్రయాణిస్తున్న మినీ బస్‌ను ఢీకొట్టింది. ఓ కిలోమీటర్ వరకు వాహనాన్ని లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. రైల్వే డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (తూర్పు ప్రాంతం) అన్సార్ అలీ నేతృత్వంలోని కమిటీ ప్రమాదంలో దర్యాప్తు చేపట్టనుందని జనరల్ మేనేజర్ జహంగీర్ హుస్సేన్ వెల్లడించారు.
మిర్సరాయ్ రైల్వే పీఎస్ అధికారి నజీమ్ ఉద్దీన్ ఈ ఘటనపై స్పందించారు. రైల్వే పోలీసులు ఖైయాచారా రైల్ గేట్‌మెన్ సద్దాం హుస్సేన్‌ను శుక్రవారం అరెస్టు చేశారని తెలిపారు. మిర్షారాయ్ ఫైర్ సర్వీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి స్పందించి, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా వెలికితీయడంతో పాటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చటోగ్రామ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Visakha News : విశాఖ ఆర్కే బీచ్ టు పోలీసు స్టేషన్ వయా బెంగళూరు, సాయి ప్రియ కేసులో ట్విస్టులు!