పట్టపగలే డాక్టర్ కిడ్నాప్‌నకు యత్నం- వ్యక్తిని పట్టుకొని చితకబాదిన ప్రజలు
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలు ఆత్రంగా ఎదురుచూశారు.
ప్రశాంతమైన శ్రీకాకుళం ఉదయాన్నే ఉలిక్కిపడింది. ప్రముఖ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు కొందరు విఫలయత్నం చేశారు. వైద్యుడి కిడ్నాప్‌కు దుండగులు ప్రయత్నించారన్న వార్త సిక్కోలులో కలవరానికి గురి చేసింది. ప్రముఖ వైద్యుడు గూడేన సోమేశ్వరరావును ఎత్తుకెళ్లేందుకు ఒడిశా నుంచి వచ్చిన వ్యక్తులు యత్నించారు. ఆయన నివాసం సమీపంలోనే ఇద్దరు ఆగంతకులు దాడికి తెగబడి తమతో తీసుకెళ్లేందుకు ట్రై చేయడం ఆందోళన నెలకొంది.
ఉలిక్కిపడ్డ సిక్కోలు
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలు ఆత్రంగా ఎదురుచూశారు. ప్రముఖ వైద్యుడిగా, కిమ్స్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన గూడేన సోమేశ్వరరావుపై బుధవారం తెల్లవారు జామున ఇద్దరు ఆగంతకులు దాడి చేశారు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కిమ్స్ ఎదురుగా ఉన్న భవనంలోనే నివాసం ఉంటున్న సోమేశ్వరరావు రోజూ కిమ్స్ ఎమర్జెన్సీ వార్డు సమీపంలో షటిల్ ఆడుతుంటారు. బుధవారం ఉదయం రెండో అంతస్తులో ఉన్న బ్లిస్ జిమ్ దాటి కిందకు వస్తుండగా కిడ్నాప్ చేసేందుకు యత్నించారు.
పక్కా ప్లానింగ్‌తో
జిమ్ మెట్లపై మాటు వేసి ఉన్న ఆగంతకుడు వెనుక నుంచి వైద్యుడు సోమేశ్వరరావుపై దాడికి పాల్పడ్డాడు. ఆయన్ని వెనక్కి లాగి తనతో తెచ్చుకున్న టీషర్టును తలపై ముసుగులా వేసేశాడు. మెట్ల కింద కాపు కాసిన మరో ఆగంతకుడు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి డాక్టర్ని కిందికి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన సోమేశ్వరరావు వెంటనే తేరుకుని ఆగంతకుల నుంచి తప్పించుకునేందుకు పెనుగాలడుతూ ప్రతిఘటించారు.
సోమేశ్వరరావు కేకలతో పరుగుపరుగున వచ్చిన ప్రజలు
సోమేశ్వరరావు కేకలు విన్న చుట్టుపక్కల వారు కూడా కేకలు వేయడం స్టార్ట్ చేశారు. ఈ పెనుగులాటలో ముగ్గురూ మెట్లపై నుంచి కిందకు జారి పడ్డారు. ఇంతలో అక్కడి అరుపులతో అలెర్టైన సెక్యూరిటీ గార్డులు, జిమ్‌లో ఉన్నవారు, రోడ్డుపై ఉన్న వారు రావడంతో దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఒక్కసారిగా వాళ్లంతా దుండగులను చుట్టుముట్టారు.
అయినా ఏదోలా తప్పించుకునేందుకు దుండగులు ప్రయత్నించారు. వారిని వెంబడించి ఒకరిని పట్టుకోగలిగారు స్థానికులు. మరో దుండగుడు మాత్రం ఆస్పత్రి ఎదురుగా సిద్ధంగా ఉంచిన కారులో పారిపోయాడు. పట్టుబడిన వ్యక్తిని అక్కడున్న వారు దేహశుద్ధి చేసి రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ ఈశ్వరప్రసాద్ అగంతుకుడిని పోలీస్ స్టేషన్ తరలించారు.
సీన్‌లోకి పోలీసులు
తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని డాక్టర్ సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమేశ్వరరావుపై దాడి చేసిన వారు ఒడిశా నెంబర్ ప్లేట్ కలిగిన ఇన్నోవా కారులో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారులో డ్రైవర్‌తోపాటు మరొకరు ఉండగా, మరో ఇద్దరు సోమేశ్వరావుపై దాడి చేశారని చెప్పారు. సోమేశ్వరావు మాత్రం తనపై ఇద్దరే దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని విశాఖ నగరంలోని పెందుర్తి సమీపంలో ఉన్న సుజాతానగర్‌కు చెందిన పరమేష్ గుర్తించారు. తనతోపాటు వచ్చిన వ్యక్తి ఆదే ప్రాంతానికి చెందిన రాజు అని పోలీసుల విచారణలో పరమేష్ వెల్లడించినట్టు తెలిసింది. రంజిత్ అనే మరో పేరు కూడా చెప్పినట్టు సమాచారం. రూ.50 వేలు ఇస్తామని చెప్పి రాజు తనను ఇక్కడికి తీసుకు వచ్చాడని విచారణలో పరమేష్ వెల్లడించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాజుకే తెలుసని, ఇంతకుమించి తనకేమీ తెలియదని చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు.
కిడ్నాపర్లు కొన్నాళ్లుగా సోమేశ్వరరావు కదలికలపై నిఘా ఉంచి, మూడు రోజులు క్రితం సోమేశ్వరరావు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్టు నిందితుడు వెల్లడించాడు. పోలీసులు మాత్రం పరమేష్ మాటలను విశ్వసించకపోయినా ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. పరమేష్, రాజు వాడుతున్న ఫోన్ నెంబర్లు వారి పేరుతో లేవని పోలీసుల విచారణలో తేలింది. పరమేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ జరిపేందుకు రెండో పట్టణ పోలీసులు విశాఖపట్నం బయల్దేరి వెళ్లారు.
భూ లావాదేవీలే కారణమా?
వివాదరహితుడు, సౌమ్యుడుగా పేరు పొందిన సోమేశ్వరావును కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న చర్చ నడుస్తోంది. సోమేశ్వరరావు స్వగ్రామం మందస మండలం గుడారి రాజపురం. ఆయన ఆర్ధిక లావాదేవీలన్నీ ఆయన తండ్రి జగ్గయ్య చూసుకుంటారని తెలిసింది. భూముల కొనుగోలు వ్యవహారం అంతా జగ్గయ్య చేతుల మీదగానే సాగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.
ఒడిశా బ్యాచ్‌తో గొడవ
మందస మండలం డబారు గ్రామంలో 15 రోజుల క్రితం ఒక భూమి వ్యవహారంలో ఒడిశాకు చెందిన బ్యాచ్‌తో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అదే సోమేశ్వరారావుపై దాడి, కిడ్నప్ యత్నానికి దారి తీసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమి రిజిస్ట్రేషన్‌లో ఉన్న తేడాలు వల్ల వివాదం తలెత్తిందని సమాచారం. డబారు గ్రామంలోనే హెచ్పీ గ్యాస్ ఎజెన్సీ ఏర్పాటుకు సంబంధించి కూడా కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నట్లు వినికిడి. ఈ వ్యవహారాలన్నీ సోమేశ్వరరావు తండ్రి జగ్గయ్య చూసుకుంటున్నారు. ఇవే సోమేశ్వరరావుపై దాడికి కారణమన్న చర్చ జరుగుతున్నా పోలీసులు ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు.