Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
Anantapur Fake JC Arrest: తమ టాలెంట్‌ను మొత్తం మంచి పనులకు కాకుండా చెడ్డ పనులకు వాడుతూ చివరికి కటకటాల పాలవుతున్నారు. ట్రైనీ జేసీ అంటూ ఎంతో మందిని మోసం చేసింది ఓ కి‘లేడీ’.
Anantapur Fake JC Arrest: ఈ మధ్య మోసాలు చేయడం, చోరీలు, దోపిడీలు చేయడానికి కొందరు ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు. తమ టాలెంట్‌ను మొత్తం మంచి పనులకు కాకుండా చెడ్డ పనులకు వాడుతూ చివరికి కటకటాల పాలవుతున్నారు. ట్రైనీ జేసీ అంటూ ఎంతో మందిని మోసం చేసింది ఓ కి‘లేడీ’. విషయం తెలిసిన తరువాత స్థానికులు, ఆమె చేతిలో మోసపోయిన వారు ఆశ్చర్యపోతున్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనుమానంతో పోలీసులకు సమాచారం..
కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం పరిసర ప్రాంతాల్లో సింధుజ అనే అమ్మాయి ట్రైనీ ఐఏఎస్ అని చెప్పి అక్కడి వాళ్లను నమ్మించింది. అంతటితో ఆగకుండా ఏకంగా పలు సచివాలయాలు తనిఖీ చేసి హల్ చల్ చేసింది. ఈమె వ్యవహారం గమనించిన కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం చెప్పగా సింధూజను శెట్టూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించిన పోలీసులు సింధూజ నకిలీ ట్రైనీ జేసీ అని తేల్చారు.
శెట్టూరు పోలీసులు సింధూజ స్వస్థలం వివరాలు ఆరాతీయగా.. తనది సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం అని చెబుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నట్టు అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఎస్సై యువరాజు, తహసీల్దార్ శంకరయ్య ఆ యువతిని విచారించారు. విచారణలో భాగంగా ఓ సారి కలెక్టర్ ఆఫీసుకు తీసుకుని వెళ్లి మళ్లీ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చినట్లు సమాచారం.
జాయింట్ కలెక్టర్ అంటూ హల్ చల్
సింధూజ అనే యువతి శెట్టూరు మండలంలో జాయింట్ కలెక్టర్ అంటూ హల్ చల్ చేసింది. శెట్టూరు మండలం తిప్పనపల్లి, చింతర్లపల్లి సచివాలయాలు, శెట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు సైతం తనిఖీ చేసింది. అయితే ఆమె వ్యవహారం గమనించిన సిబ్బంది నకిలీ జేసీగా భావించి మండల అధికారులకు సమాచారం అందించారు. నకిలీ ట్రైనీ జేసీ అని అర్థమైన వెంటనే మండల అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, శెట్టూరు పోలీసులు సింధూజను అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ కలెక్టర్ అని చెప్పి మోసాలకు పాల్పడుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టిన సింధూజపై కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశించారు.