అచ్యుతాపురం సెజ్‌లో దారుణం, బాత్రూమ్‌లో నవజాత శిశువు!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో దారుణం జరిగింది. ఎవరో గుర్తు తెలియని మహిళ క్వాంటమ్ కంపెనీ బాత్రూంలో బిడ్డను ప్రసవించింది. అనంతరం శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.
Anakapalle District News: రోజురోజుకూ మనుషుల్లో మానవ విలువలు తగ్గిపోతున్నాయి. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తర్వాత వివాహేతర సంబంధాలు నడపడం.. తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో గర్భం దాల్చడం.. ఆపై విషయం తెలుసుకొని అబార్షన్లు చేయించుకోవడం, అలా కుదరకపోతే బిడ్డలను కని ఎక్కడో ఓ చోటు పడేయడం పరిపాటిగా మారింది. అప్పుడే లోకాన్ని చూసిన చిన్నారులకు అమ్మ ప్రేమను పంచాల్సిన మహిళలు.. కర్కశంగా వ్యవహరిస్తూ వారి జీవితాలను కాల రాస్తున్నారు. అయితే అలాంటి ఓ ఘటనే అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది. క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్ లో నవజాత శివువు కలకలం రేపింది. క్వాంటమ్ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళే ఆ బిడ్డను బాత్రూంలో ప్రసవించినట్లు తెలుస్తోంది. పెళ్లి కాకుండా బిడ్డ పుట్టడం వల్లే అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు సిబ్బంది భావిస్తున్నారు. ఆ బిడ్డను ప్రసవించిన మహిళ ఎవరో తెలుసుకునేందుకు యాజమాన్యం కంపెనీకి వెళ్లే బస్సుల్లో తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలోనే చిన్నారి గురించి స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రం సిబ్బందికి తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది నవజాత శిశువును తమతోపాటు తీసుకెళ్లారు. అనంతరం యాజమాన్యం పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు నెలల క్రితం రైలు బాత్రూంలో శిశువును వదిలెళ్లిన మహిళ
ఓ మహిళ అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. పేగు తెంచుకుని అప్పుడే పుట్టిన బిడ్డను టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లిన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. ధన్‌బాద్ - అల్లీపి (Dhanbad-Allepy Bokaro Express) ఎక్స్‌ప్రెస్ రైలులో ఉదయమే ఓ గుర్తు తెలియని మహిళ రైలులోనే ప్రసవించింది. అనంతరం పుట్టిన బిడ్డను రైలు టాయ్‌లెట్‌లో వదిలి వెళ్లగా మిగతా ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌పీఎఫ్ జీఆర్‌పీ పోలీసులు రైలులోని శిశువును కాపాడి, రైల్వే ఆసుపత్రికి తరలించారు.
ఆర్పీఎఫ్ పోలీసుల కథనం ప్రకారం.. ఓ మహిళ train No.13351 బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రసవించింది. అప్పుడే పుట్టిన మగబిడ్డను రైలు టాయ్‌లెట్‌లో వదిలేసి నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోయింది. బీ1 కోచ్ టాయ్‌లెట్ నుంచి సింహాచలం దాటిన తరువాత ఏడుపు వినిపించడంతో మిగతా ప్రయాణికులు టాయ్‌లెట్ తలుపు తెరిచి చూసి షాకయ్యారు. అప్పుడు పుట్టిన ఓ మగబిడ్డ పిండంతో టాయ్‌లెట్ షింకులో గుర్తించారు. సింహాచలం స్టేషన్ దాటిన తరువాత ఓ పసిబిడ్డను టాయ్‌లెట్‌లో గుర్తించడంపై టీటీ వి బ్రహ్మాజీకి తోటి ప్రయాణికులు సమాచారం అందించారు. టీటీ ట్రెయిన్ రెస్క్యూ టీమ్, ఎస్కార్ట్ టీమ్‌కు సమాచారం అందించగా, వారు ఆ శిశువును విశాఖపట్నం డివిజన్ రైల్వే హాస్పిటల్‌కు తరలించారు. ఆ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని, అనంతరం మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం శిశువును చైల్డ్ కేర్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.