AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
AP Crime News: ఏపీలో మరో దారుణం జరిగింది. స్కూల్ విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఏపీలోని అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
School Student Murder | రాంబిల్లి: ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన ఘోరాన్ని మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. ఇంట్లోకి చొరబడి విద్యార్థినిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో జరిగింది.
విద్యార్థిని (14) రాంబిల్లి మండలం కొప్పు గుండు పాలెం లో 9వ తరగతి చదువుతోంది. బాలికపై సురేష్ అనే యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. బాలిక తీవ్రరక్తస్రావంతో కుప్పకూలిపోయింది. వెంటనే నిందితుడు కత్తి వదిలేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినిని ఎందుకు హత్య చేశాడు, వీరి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, లేక తనను ప్రేమించడం లేదని హత్య చేశాడా అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హోం మంత్రి సీరియస్
బిల్లి మండలం కొప్పు గుండుపాలెం విద్యార్థిని హత్య ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విద్యార్థిని హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి అనిత అనకాపల్లి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విషయాలు ఆరా తీశారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని ఆదేశించారు. హోం మంత్రి ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి కోసం రంగంలోకి దిగాయి.