Crime News : రియల్ ఆవేశం స్టార్ - పోలీసులు ఆపారని బైక్ కాల్చేసుకున్నాడు.. కేసుల పాలయ్యాడు !
రాంగ్ రూట్‌లో వస్తూండగా పోలీసులు ఆపారని తన బైక్‌కు నిప్పు పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. పోలీసులు అతనిపై కేసు పెట్టారు.
Crime News : నీ కోపమే నీకు శత్రువు అన్నారు పెద్దలు. కానీ ఆ ఆవేశం వస్తే ఏం చేస్తున్నామో కూడా స్థితికి వెళ్లిపోతారు కొందరు. తమ శత్రువు తమపై దాడి చేస్తోందని తెలుసుకోలేక.. తమపైనే దాము దాడి చేసుకుంటారు. చివరికి అది అన్ని విధాలుగా నష్టం చేస్తుంది. తర్వాత తీరిగ్గా చింతించినా ప్రయోజనం ఉండదు. హైదరాబాద్‌లో ఓ ఆవేశం స్టార్‌ను చూస్తే ఇదే నిజం అని కళ్ల ముందు కనిపిస్తుంది.
రాంగ్‌రూట్‌లో వచ్చి పోలీసులకు చిక్కిన అశోక్
హైదరాబాద్‌లో పోలీసులు ఎక్కడో చోట తనిఖీలు చేస్తూనే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే కాదు హెల్మెట్ లేకపోవడం దగ్గర్నుంచి రాంగ్ రూట్‌లో రావడం వరకూ దేన్నీ వదిలి పెట్టరు. అలా మైత్రివనం కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రాంగ్‌రూట్‌లో వస్తూ కనిపించాడు అశోక్ అనే వ్యక్తి. ఆ పోలీసులే కదా అనుకున్నాడో లేకపోతే పోలీసుల్నీ చూడలేదో కానీ నేరుగా వచ్చి వాళ్లకు చిక్కిపోయాడు. అప్పటికే చికాకులో ఉన్నాడేమో కానీ.. రాంగ్‌రూట్‌లో వస్తే తప్పంటి ? అని పోలీసులతో వాదనకు దిగాడు. ఆ వాదనలో కోపం వచ్చేసింది. చలాన్లు కట్టనే కట్టనంటూ బైక్ నుంచి పెట్రోల్ తీసి తన బండికి తానే నిప్పంటించుకున్నాడు.
బైక్ కాలిపోయింది - కేసుల పాలయిన అశోక్
ఆ తర్వాత పోలీసులు నడి రోడ్డుపై తమపై దౌర్జన్యం చేసినందుకు..బండికి నిప్పంటించినందుకు కేసులు పెట్టికేసులు పెట్టారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కూర్బోబెట్టారు. అశోక్ మైత్రీవనంలోనే మొబైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణంలో టెన్షన్లో.. ఇంటి దగ్గర కష్టాలో కానీ.. రోడ్డు మీద పోలీసులు ఆపేసరికి ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఇన్ని కష్టాల మధ్య బైక్ ఎందుకనుకున్నాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ ఆవేశంలో ఆ పెట్రోల్ తమపై పోస్తాడని భయపడ్డారేమో కానీ..అతను పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్నా... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
మూడు నెలలైనా దొరకని బ్యాంకు దొంగల జాడ, 8 కేజీల బంగారం తిరిగివ్వాలని బాధితులు ధర్నా
బైక్ పోయి.. కేసులతో కోర్టులతో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి - తన కోపమే తనకు శత్రువు
ఇప్పుడు అశోక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు. ఆవేశం తగ్గి ఉంటుంది. ఇప్పుడు అతనికి బైక్ లేదు. బైక్ లేకపోయినా చలానా తప్పదు. పైగా తన బండి కాల్చుకుని తానే కేసుల పాలయ్యాడు. ఇప్పుడా కేసుల నుంచి బయటపడాలంటే కోర్టుల చుట్టూ తిరిగి ఫైన్లు కట్టుకోవాలి. అశోక్ తీరిగ్గా ఆలోచిస్తే.. తన ఆవేశం తనకు ఎంత నష్టం చేసిందో తెలుస్తుంది. అయితే నష్టం జరిగిపోయింది. ఇప్పుడు అశోక్ కూడా చేయడానికి ఏమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బైక్ కూడా కాలిపోయింది మరి !
70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !