మటన్ తింటుండగా గొంతుల్లో ఇరుక్కున్న మేక కన్ను, ఊపిరాడక మృతి
Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి మటన్ తింటుండగా మేక కన్ను గొంతులో ఇరుక్కుని ఊపిరాడక ప్రాణాలొదిలాడు.
Goat Eye Killed:
బలి ఇచ్చి..తానే బలైయ్యాడు..
ఏదైనా పండగో పబ్బమో వచ్చినప్పుడు కచ్చితంగా నాన్‌వెజ్ వండేస్తారు. ఇంకొంత మంది బలి ఇస్తామని దేవుణ్ని వేడుకుంటారు. ఆ కోరిక తీరిన తరవాత మొక్కు తీర్చుకుని అదే ప్రసాదం అని తినేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి ఇలానే బలి ఇచ్చాడు. కానీ..చివరకు తానే బలి అయ్యాడు. సూరజ్‌పూర్ జిల్లాలో 50 ఏళ్ల బగర్ సాయి తన కోరిక నెరవేరితే బలి ఇస్తానని దేవుడికి మొక్కుకున్నాడు. అది తీరగానే..అనుకున్నట్టుగానే మేకను బలి ఇచ్చాడు. ఆ తరవాత కుటుంబ సభ్యులతో కలిసి రుచికరంగా మటన్ వండుకున్నాడు. ఆ వేడి వేడి కూరను పళ్లెంలో వేసుకుని ఆస్వాదిస్తున్నాడు. కానీ..అదే తన చివరి భోజనం అవుతుందని ఊహించలేకపోయాడు. మటన్ ముక్కలు తింటుండగా అనుకోకుండా మేక కన్ను మింగేశాడు. అసలు కూరలో అలా కన్ను వస్తుందనే ఎవరూ ఊహించలేదు. మింగిన తరవాత వెంటనే బయటకు కక్కేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గొంతులో ఇరుక్కోవడం వల్ల నరకయాతన అనుభవించాడు. ఊపిరి తీసుకోలేకపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. ఆ కన్ను గొంతుల్లో ఇరుక్కుపోయి శ్వాస ఆడక చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు.
బలి విషయంలో గొడవ..
బక్రీద్ పండుగ ముందు ముంబయిలో ఓ హౌజింగ్ సొసైటీలో హిందువులు, ముస్లింల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వచ్చి మరీ అక్కడి పరిస్థితులు అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. సాధారణంగా ముస్లింలు బక్రీద్ పండుగకు ఓ మేకను బలి ఇస్తారు. ఇందుకోసం ఓ ముస్లిం కుటుంబం రెండు మేకల్ని తమ ఫ్లాట్‌కి తీసుకొచ్చింది. లిఫ్ట్‌లో వాటిని తీసుకురావడాన్ని చూసిన మిగతా వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మోసిన్ షేక్ కుటుంబంపై మండి పడ్డాయి. అంతే కాదు. అపార్ట్‌మెంట్ ముందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. హిందువులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి హనుమాన్ చాలిసా చదవడం మొదలు పెట్టారు. ఇది కాస్తా స్థానికంగా అలజడి సృష్టించింది. ఆ తరవాత బజ్‌రంగ్ దళ్ కూడా అక్కడికి వచ్చింది. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆ రెండు మేకల్నీ స్వాధీనం చేసుకున్నారు. సొసైటీలో మేకల్ని బలి ఇవ్వడానికి వీల్లేదని హిందువులు తేల్చి చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసులు మొహరించి రెండు వర్గాలకూ నచ్చజెప్పారు. దీనిపై ఆ ముస్లిం కుటుంబం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పండుగను ప్రశాంతంగా జరుపుకోకుండా అడ్డుకున్న వారిపై ఫిర్యాదు చేసింది. ఈ సొసైటీలో దాదాపు 250 ముస్లిం కుటుంబాలుంటున్నాయని, వాళ్లందరికీ ఇలాంటి పండుగలు జరుపుకునేందుకు బిల్డర్ అనుమతినిచ్చాడని బాధితుడు మోసిన్ షేక్ స్పష్టం చేశాడు.
"ఈ సొసైటీలో వందలాది ముస్లిం కుటుంబాలున్నాయి. ఏటా బక్రీద్ జరుపుకునేందుకు, మేకల్ని బలి ఇచ్చేందుకు ప్రత్యేకంగా మాకు ఓ స్పేస్ ప్రొవైడ్ చేశారు. కానీ ఈ సారి మాత్రం మాకు అనుమతినివ్వలేదు. మిగతా ఫ్యామిలీస్‌తో మాట్లాడుకోవాలని చెప్పాడు. అంతే కాదు. మేకల్ని ఇంటికి తీసుకురావడాన్నీ అనుమతించలేదు. అసలు ఈ సొసైటీ ప్రాంగణంలో మేకల్ని బలి ఇవ్వాలన్న ఆలోచన మాకు లేనే లేదు"
- మోసిన్ షేక్
Also Read: Loksabha Election 2024: విపక్షాల్లో యునిటీ ఉన్నట్టేనా, 2024లో మోదీ సర్కార్‌కి గట్టి పోటీనివ్వగలవా?