Crime News: పండ్ల షాపులో పాటల చిచ్చు- సౌండ్ తగ్గించమంటే చెవి కోసేశాడు
షాపులో సౌండ్ పెట్టిన యజమానితో గొడవ పడ్డాడు పక్క దుకాణందారు. అది కాస్త తీవ్రమైంది. అంతే ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
క్షణికావేశంలో ఓ వ్యక్తి.. తండ్రి, కొడుకులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయాలపాలైన వారు రిమ్స్ చికిత్స పొందుతుండగా దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవుట్ పోస్ట్ పోలీసులు, తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీ వద్ద సతీష్ అనే వ్యక్తి ఫ్రూట్‌షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. ఆ షాప్‌లో జెండాల వీధికి చెందిన ముత్యాలరావు జాయిన్ అయ్యాడు. పదినెలలపాటు పని చేశాడు. సడెన్‌గా మానేసిన ముత్యాలరావు... సతీష్ షాప్ పక్కనే పోటీగా మరో షాప్ పెట్టాడు.
షాపు పెట్టడంతో ముత్యాలరావు, సతీష్ మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెల రోజులుగా తగాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆదివారం రాత్రి కూడా దుకాణం వద్ద మైకుల్లో సౌండ్ అధికంగా పెట్టారంటూ ఇరువురు వాదులాడుకున్నారు. అనంతరం షాపు యజమాని వచ్చి సతీష్, ముత్యాలరావుకు సర్దిచెప్పడంతో గొడవ సమసిపోయింది.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పొట్నూరు ముత్యాల రావు, అతని తండ్రి పొట్నూరు భీమరాజు షాపు ఓపెన్ చేసి యథావిధిగా మైక్‌లో సౌండ్ పెట్టారు. దీనిపై సతీష్ అభ్యంతరం చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరగడంతో అరటిగెలలు కోసే కత్తితో ముత్యాలరావు, భీమరాజుపై సతీష్ దాడి చేశాడు.
ఈ ఘటనలో ముత్యాలరావుకు చెవి, ఎడమ చేతిపై గాయాలు కాగా, భీమ రాజుకు ఎడమ చేతి చూపుడు వేలు, కుడి కాలు పాదంపైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించి బాధితులను రిమ్స్ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్టన్ ఎస్.ఐ. స్థలానికి చేరుకొని నిందితుడు సతీష్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్ తరలించారు.
క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించింది. బాధితులు ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్.ఐ. ప్రవళిక ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి వారి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు, అతనికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ. పేర్కొన్నారు.