Warangal News: ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదాలు - నచ్చిన హెయిర్ కటింగ్ చేయించలేదని ఒకరు, ఎండలో తిరగొద్దన్నందుకు మరొకరు సూసైడ్
Telangana News: నచ్చిన హెయిర్ కట్ చేయింలేదని ఓ బాలుడు, ఎండలో తిరగొద్దని తల్లి మందలించినందుకు మరో బాలుడు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటనలు వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్నాయి.
9 Years Old Boy Forceful Death In Mahabubabad: చిన్నా లేదు.. పెద్దా లేదు.. కొందరు చిన్న చిన్న విషయాలకే బలవన్మరణాలకు పాల్పడుతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ బాలుడు తనకు నచ్చిన హెయిర్ కటింగ్ చేయించలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో చోట ఎండలో తిరగొద్దని తల్లి మందలించినందుకు మరో బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నచ్చిన హెయిర్ కట్ చేయించలేదని
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ 9 ఏళ్ల బాలుడు తనకు నచ్చిన హెయిర్ కటింగ్ చేయించలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడైన ఈసం హర్షవర్థన్ (9) సీతానగరంలోని హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల క్రమంలో కొద్ది రోజుల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ నెల 25న హర్షవర్థన్‌ను హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్ షాపునకు తీసుకెళ్లాడు. తండ్రి చెప్పిన ప్రకారం సెలూన్ షాప్ వ్యక్తి బాలునికి కటింగ్ చేయించగా.. అది తనకు నచ్చలేదని తండ్రితో గొడవపడ్డాడు. అయితే, చదువుకునే అబ్బాయికి అలాగే ఉండాలని తండ్రి నచ్చచెప్పేందుకు యత్నించాడు. ఈ క్రమంలో హర్షవర్థన్ పురుగుల మందు తాగాడు. అస్వస్థతకు గురైన బాలున్ని చూసిన తల్లిదండ్రులు నర్సంపేటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు గురువారం పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
ఎండలో తిరగొద్దన్నందుకు..
అటు, వరంగల్ జిల్లా దుగ్గొండి (Duggondi) మండలంలో ఓ బాలుడు ఎండలో తిరగొద్దని తల్లి మందలించినందుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైసంపల్లె గ్రామానికి చెందిన సిద్దు (9) అనే బాలుడు వేసవి సెలవుల క్రమంలో ఇంటి వద్దే ఉంటున్నాడు. గత వారం రోజులుగా ఎండలు అధికంగా ఉండడంతో బయటకు వెళ్లొద్దని తల్లి మందలించింది. దీంతో క్షణికావేశానికి గురైన బాలుడు గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎదురింటి వాళ్లు అరుస్తూ సిద్ధూని లోపలికి వెళ్లి సిద్దూని కిందకు దించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం - వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్