Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు - ఘోర ప్రమాదాల్లో ఏడుగురు మృతి
Crime News: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, మెదక్ జిల్లాలో నలుగురు మృతి చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Severe Accidents In Ap And Telangana: తెలుగు రాష్ట్రాల్లో శనివారం జరిగిన ఘోర ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో (Kurnool District) జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. తెలంగాణలోని మెదక్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందవరం మండలం ధర్మాపురం వద్ద ఓ కారు ఆటోను ఢీకొనగా.. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలిక రజియాను చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు వీరనాగమ్మ (60), గౌరమ్మ (61), బేబీ (32)లుగా గుర్తించారు. ప్రమాదానికి కారు మితిమీరిన వేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద ధాటికి ఆటో, కారు రోడ్డు పక్కన ఎగిరిపడ్డాయి.
మెదక్ జిల్లాలో..
మరోవైపు, మెదక్ జిల్లాలో (Medak District) శనివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం పోతారం వద్ద రహదారిపై స్థానిక రైతులు ధాన్యం ఆరబోశారు. ధాన్యం కుప్పలుగా ఉండడంతో రోడ్డుకు ఓవైపు నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంజనేయులు, ఆయన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు స్పాట్‌లోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
అటు, కోదాడ సమీపంలో విజయవాడ వెళ్తున్న బస్ ప్రమాదానికి గురైంది. రహదారిపై ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం