Zomoto: ఫుడ్ క్వాలిటీపై జొమాటో కిరికిరీ! ఆగ్రహంగా రెస్టారెంట్లు!! ఎందుకో తెలుసా?
జొమాటో (Zomato) తీసుకున్న ఓ నిర్ణయం రెస్టారెంట్ యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఆహార నాణ్యతపై ఎవరైనా వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా ఆర్డర్లను నిలిపివేస్తామని అంటోంది.
Zomato serves up a severe food quality policy stoking concerns among restaurants: ఫుడ్ అగ్రిగేటర్, డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) తీసుకున్న ఓ నిర్ణయం రెస్టారెంట్ యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఆహార నాణ్యతపై ఎవరైనా వినియోగదారుడు ఫిర్యాదు చేస్తే తాత్కాలికంగా ఆర్డర్లను నిలిపివేస్తామని తెలిపింది. నాణ్యతకు డోకా లేదని సర్టిఫికెట్ పొందిన తర్వాతే తిరిగి ఆర్డర్లు స్వీకరిస్తామని దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లకు ఈమెయిల్ అడ్వైజరీ పంపించింది. 'ఎవరైనా కస్టమర్ ఆహారం, పానీయాల నాణ్యత బాగాలేదని ఫిర్యాదు చేస్తే, అవి ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తే నాణ్యతలేని ఫుడ్ క్వాటిలీగా పరిగణిస్తాం' అని జొమాటో వెల్లడించింది.
ఈ పాలసీ ఏప్రిల్ 18 నుంచి అమల్లోకి రానుంది. కస్టమర్ ఫిర్యాదు చేయగానే అందులో వాస్తవం ఉందో లేదో మొదట జొమాటో దర్యాప్తు చేస్తుందని తెలిసింది. 'వచ్చిన ఫిర్యాదును బట్టి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ధ్రువీకరించిన థర్డ్‌పార్టీ దర్యాప్తు చేసేంత వరకు జొమాటోలో ఆర్డర్ చేయడాన్ని నిలిపివేస్తాం. ఆ దర్యాప్తునకు అయ్యే పూర్తి ఖర్చును రెస్టారెంటే భరించాల్సి ఉంటుంది' అని జొమాట్ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో నాణ్యత లోపించిన ఆహార పదార్థాలు, ప్యాకేజీ ఫుడ్, పానీయాలు, మాంసం, వెజిటేరియన్ బదులు నాన్‌వెజ్ ఫుడ్ పంపించడం వంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి వాటికోసం ఓ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది.
జొమాటో నుంచి వచ్చిన అడ్వైజరీపై రెస్టారెంటు యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తన పరిధిని దాటి దర్యాప్తు వ్యవహారాల్లోకి చొరబడుతోందని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తెలిపింది. వెంటనే ఈ పాలసీలో మార్పులు చేసుకోవాలని లేఖ పంపించింది. ఈ సంఘంలో 5 లక్షలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. రెస్టారెంట్లను సంప్రదించకుండానే జొమాటో ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. రెస్టారెంట్లను తనిఖీ చేసే హక్కు వారికి లేదని స్పష్టం చేస్తున్నారు.
'ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వంటి ప్రభుత్వ ఏజెన్సీలు మాత్రమే ఆహార నాణ్యతను సర్టిఫై చేస్తాయి. జొమాటో ఆ పాత్ర తీసుకోవడానికి వీల్లేదు' అని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు కబీర్ సూరీ అన్నారు. కుళ్లిపోయిన ఆహారానికి సరైన నిర్వచనమే లేదన్నారు. ఒక ఫొటోగ్రాఫ్‌ను చూసి ఫిర్యాదు సరైందో లేదో జొమాటో ఎలా గుర్తిస్తుందని ప్రశ్నించారు. 'కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించనప్పుడు రెస్టారెంట్లపై వారికి నమ్మకం ఎలా కుదురుతుంది. వ్యాపారం దెబ్బతింటుంది కదా' అని జొమాటో బదులిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
most expensive handwash right now pic.twitter.com/fb3reKh0dD
— zomato (@zomato) April 13, 2022