Reliance AGM 2022: ఇంట్లో కూర్చునే రిలయన్స్ ఏజీఎంలో పాల్గొనవచ్చు, ఓటూ వేయవచ్చు - ఇదిగో ఇలా
కంపెనీ భవిష్యత్ ఆలోచనలు, వ్యూహాల మీద ఈ ఏడాది ఏజీఎం ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడవచ్చు. ఇంట్లో కూర్చునే రిలయన్స్ ఏజీఎంలో మీరు పాల్గొనేలా, ఓటు కూడా వేసేలా రిలయన్స్ ఏర్పాట్లు చేసింది.
Reliance AGM 2022: ఇవాళ (సోమవారం - 29 ఆగస్టు 2022) మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఏజీఎం (Reliance AGM) ప్రారంభమవుతుంది.
రిలయన్స్ ఏజీఎంను ఎక్కడ, ఎలా చూడాలి?
ఏజీఎంను వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ నిర్వహిస్తోంది. JioMeetతో పాటు ఐదు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. కాబట్టి, చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు. కూర్చున్న చోటు నుంచే ఈ సమావేశాన్ని చూడవచ్చు, అంబానీ ప్రసంగాన్ని వినవచ్చు.
గత వార్షిక సాధారణ సమావేశాల (AGM) ప్రసారాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లోనే కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు కూ (Koo) ఇన్‌స్టాగ్రామ్‌లోనూ (Instagram) ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.
GMetri ద్వారా, రిలయన్స్ ఏజీఎం (Reliance AGM) వర్చువల్ రియాలిటీ (VR) ప్లాట్‌ఫామ్ ద్వారా సమావేశం జరుగుతుంది. ఈ విధానంలో, వర్చువల్ పద్ధతిలో మీరు కూడా పాల్గొనవచ్చు. లాంజ్ నుంచి వివిధ వర్చువల్ రూమ్స్‌లోకి ప్రవేశించవచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఇదే కంపెనీ వార్షిక నివేదిక 2021-22లో, వ్యాపారాల వారీగా ముఖ్యాంశాలను చదవవచ్చు, అర్ధం చేసుకోవచ్చు.
45వ ఏజీఎంకు సంబంధించిన వివరాలను ఎవరైనా సులభంగా తెలుసుకునేలా 7977111111 నంబర్‌తో వాట్సాప్ చాట్‌బాట్‌ను రిలయన్స్ యాక్టివేట్ చేసింది. ఏజీఎంకు సంబంధించిన తేదీలు, ప్రక్రియలను ఈ చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇచ్చిన నంబర్‌కు మీ మొబైల్ నంబర్‌తో 'హాయ్' అన్న సందేశం పంపితే చాలు. చాట్‌బాట్ యాక్టివేట్ అవుతుంది. ఆ వెంటనే మీకు తిరుగు మెసేజ్ వస్తుంది. ఏజీఎం (AGM) తేదీ, సమయం, దానిని ప్రత్యక్షంగా ఎలా చూడాలి, వాటాదారులు ఎలా ఓటు వేయవచ్చు లేదా ప్రశ్నలేమైనా ఉంటే ఎలా అడగవచ్చు మొదలైన విషయాలను చాట్‌బాట్ మీకు అందిస్తుంది. దాని సూచనలు పాటిస్తే మీరు ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు, సందేహాలు తీర్చుకోవచ్చు, మీరు రిలయన్స్ వాటాదారు అయితే ఓటు కూడా వేయవచ్చు.
సమావేశంలో ఏ నిర్ణయాలు ఉండవచ్చు?
5G సేవలు: మన దేశంలో 5G సేవలు ప్రారంభించడానికి రిలయన్స్ సంస్థ స్ప్రెక్ట్రం తీసుకుంది. దాని బ్లూప్రింట్‌ను నేటి సమావేశంలో ప్రకటిస్తారన్నది మార్కెట్ అంచనా.
జియోఫోన్ 5G: 5G సేవల రోల్ అవుట్‌తో, కంపెనీ JioPhone 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించవచ్చు. దీని ధర రూ.9,000 - 12,000 మధ్య ఉండవచ్చు. JioPhone నెక్స్ట్ తరహాలోనే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేలా సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా కంపెనీ తీసుకువస్తుందని భావిస్తున్నారు.
వారసత్వం: ముఖేష్ భార్య నీత అంబానీ, ముగ్గురు పిల్లలకు కంపెనీలో మరిన్ని హోదాలు, బాధ్యతలు, అధికారాలు కట్టబెడుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రకటనలు చేస్తారని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది.
గ్రీన్ ఎనర్జీ: ఈ నెలలోనే ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దీంతో, గ్రీన్ హైడ్రోజన్ ధరను తగ్గించడానికి RIL తన లక్ష్యాలను సవరించుకోవచ్చు.
టెలికాం, రిటైల్ IPOలు: టెలికాం (జియో), రిలయన్స్ రిటైల్ బిజినెస్‌లను విడదీసి విడిగా లిస్ట్ చేయాలన్న ప్రతిపాదనలు కొన్నేళ్లుగా నలుగుతున్నాయి. ఈ ఏజీఎంలో వీటి టైమ్‌లైన్ గురించి ప్రకటన రావచ్చని ఇన్వెస్టర్లు ఆశగా ఉన్నారు.
ఏజీఎం నేపథ్యంలో, ఇవాళ్టి నెగెటివ్ మార్కెట్‌లోనూ రిలయన్స్ స్టాక్ పుంజుకుంది. రూ.2,585 దగ్గర నష్టంతో ప్రారంభమైన షేరు ధర, అక్కడి నుంచి పుంజుకుంటూ వస్తోంది. ఉదయం 11.45 గం. సమయానికి రూ.2,624 దగ్గర ఉంది. శుక్రవారం రూ.2618 దగ్గర ఈ స్టాక్ క్లోజయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.