YES Bank JC Flowers Deal: యెస్ బ్యాంక్ గుడ్ న్యూస్, రూ.48k కోట్ల మొండి బకాయిలకు మంగళం
2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు లోన్ రికవరీలో సర్దుబాట్ల తర్వాత రూ. 48,000 కోట్ల మొండి బకాయిలను యెస్ బ్యాంక్ గుర్తించింది.
YES Bank JC Flowers Deal: యెస్ బ్యాంక్ షేర్ ఇన్వెస్టర్లకు మరో గుడ్ న్యూస్. రూ. 48 వేల కోట్ల బ్యాడ్ లోన్లను ఎట్టకేలకు జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి (JC Flowers ARC) ఈ బ్యాంక్ బదిలీ చేసింది.
ఒత్తిడిలో ఉన్న రూ. 48,000 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియోను జేసీ ఫ్లవర్స్ ARCకి అప్పగించినట్లు శనివారం తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ బ్యాంక్ పేర్కొంది. గుర్తించిన ఒత్తిడిలో ఉన్న రుణాలను (Stressed Assets) విక్రయించేందుకు స్విస్ ఛాలెంజ్ విధానంలో చేపట్టిన ప్రక్రియలో జేసీ ఫ్లవర్ ARC విన్నర్‌గా నిలిచిందని యెస్ బ్యాంక్ ఇది వరకే వెల్లడించింది. ఇప్పుడు ఆ చెడ్డ రుణాల మొత్తాన్ని (Bad loans) అందజేసింది. 2022 మార్చి 31వ తేదీ వరకు (FY22 వరకు) ఉన్న బ్యాడ్ లోన్లు అవి.
2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు లోన్ రికవరీలో సర్దుబాట్ల తర్వాత రూ. 48,000 కోట్ల మొండి బకాయిలను యెస్ బ్యాంక్ గుర్తించింది.
15:85 స్ట్రక్చర్
15:85 స్ట్రక్చర్ ప్రాతిపదికన ఈ లోన్ ఫోర్ట్‌ఫోలియోను జేసీ ఫ్లవర్స్ ARCకి యెస్ బ్యాంక్ అప్పగించింది. అంటే... లోన్స్ విక్రయంలో 15 శాతాన్ని నగదు రూపంలో, మిగిలిన 85 శాతానికి సెక్యూరిటీ రిసిప్ట్స్‌ను (SRలు) జారీ చేస్తారు.
మెరుగుపడనున్న యెస్ బ్యాంక్ ఆర్థిక స్థితి
మొండి బకాయిల పోర్ట్‌ఫోలియోను బదిలీ చేయడం ద్వారా యెస్ బ్యాంక్ ఆర్థిక స్థితిని మెరుగు పడుతుంది. ఇకపై ప్రకటించే త్రైమాసిక ఫలితాల్లో ఈ బ్యాడ్ లోన్లు బ్యాంక్ బుక్స్‌లో కనిపించవు. తద్వారా మార్జిన్ల మీద ఒత్తిడి తగ్గి, అవి మెరుగ్గా కనిపిస్తాయి.
షేర్ ధరలో సూపర్ ర్యాలీ
ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల కారణంగా, గత నెల రోజులుగా యెస్ బ్యాంక్ షేర్ ధర పెరుగుతోంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 25 శాతం పైగా లాభపడింది. గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే (డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 13, 2022 వరకు) యెస్ బ్యాంక్ షేర్లు 35 శాతం రాబడిని ఇచ్చాయి. ఈ కౌంటర్‌లో, గత ఆరు నెలల కాలంలో 70 శాతం పైగా లాభాలు కనిపించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 50 శాతం పైగా జూమ్ అయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.