PM Surya Ghar: ఫ్రీ కరెంట్ ఇచ్చే పీఎం సూర్య ఘర్ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు?
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
![PM Surya Ghar: ఫ్రీ కరెంట్ ఇచ్చే పీఎం సూర్య ఘర్ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు? Who is eligible and who is not to apply for pm surya ghar muft bijli yojana PM Surya Ghar: ఫ్రీ కరెంట్ ఇచ్చే పీఎం సూర్య ఘర్ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు కాదు?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/26/b21dc11d98ca6f1278f14606bdc7aa171711438505212545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Eligibility For PM Surya Ghar Muft Bijli Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' వల్ల చాలా తక్కువ ఖర్చుతో (సబ్సిడీ పోను) ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. తద్వారా, నెలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వాడుకోవచ్చు, షాక్ కొట్టే కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందొచ్చు.
కొత్త రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌ను (పీఎం సూర్య ఘర్ ముప్త్ బిజిలీ యోజన) తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, 2024 ఫిబ్రవరి 01న లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్ సమర్పిస్తూ పథకం గురించి ప్రకటించారు.
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.78 వేల వరకు సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది.
తాకట్టు లేకుండా రుణం
సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్ లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్‌లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం, ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.
PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు
దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
దరఖాస్తు చేసే వ్యక్తి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.
సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి.
దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయులంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే, దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు
దరఖాస్తుదారు దగ్గర అవసరమైన & సరైన పత్రాలు ఉండాలి.
దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా - ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
PM సూర్య ఘర్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు
నివాస ధృవీకరణ పత్రం
విద్యుత్ బిల్లు
బ్యాంకు పాస్ బుక్
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
రేషన్ కార్డు
మొబైల్ నంబర్
అఫిడవిట్
ఆదాయ ధృవీకరణ పత్రం
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2024 ప్రయోజనాలు
దరఖాస్తుదారు నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా వినియోగించుకోవచ్చు.
300 యూనిట్లు మించి వాడితేనే బిల్లు చెల్లించాలి.
వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మొచ్చు.
వేల రూపాయల విద్యుత్ ఖర్చుల గురించి ఆందోళన ఉండదు.
విద్యుత్తు లేని వారి ఇళ్లలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కొత్త విద్యుత్ కనెక్షన్లను కూడా ఏర్పాటు చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: కనీస వేతనం కాదు, జీవన వేతనం - జీతం లెక్క మారుతోంది!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)