Ghosting Trend: డేటింగ్‌లో కనిపించే 'ఘోస్టింగ్' ఆఫీసుల్లోకి ఎలా ఎంటరైంది, ఇంతకీ ఏమిటది?
Ghosting In The Workplace: ఇటీవలి అధ్యయనం ప్రకారం, దాదాపు 45% మంది ఉద్యోగార్థులు ఘోస్టింగ్ బారినపడ్డారు. ఇటీవలి కాలంలో ఈ బాధలు బాగా పెరిగాయి.
Ghosting Behaviour In Employers and Eemployees: సాధారణంగా, "ఘోస్టింగ్" అనే పదాన్ని డేటింగ్ విషయాల్లో వింటుంటాం. అది ఇప్పుడు పని ప్రదేశాల్లోకి కూడా చొరబడింది, యజమానులు - ఉద్యోగులు మధ్య దూరాన్ని పెంచుతోంది. ఈ ట్రెండ్ కంపెనీలు చేపట్టే రిక్రూట్‌మెంట్లు & ఉద్యోగుల ప్రొఫెషనలిజంపై సందేహాలను పెంచుతోంది. ముఖ్యంగా, వేగంగా మారుతున్న నేటి జాబ్ మార్కెట్‌లో ఈ ట్రెండ్ వికృత రూపం ప్రదర్శిస్తోంది.
ఘోస్టింగ్ అంటే ఏంటి?
ఒక వ్యక్తి, ఎలాంటి వివరణ లేకుండా మరో వ్యక్తితో అన్ని రకాల కమ్యూనికేషన్‌లను హఠాత్తుగా ఆపేయడాన్ని "ఘోస్టింగ్" అంటారు. దీనివల్ల, అసలు ఏం జరిగిందో అర్ధం కాక రెండో వ్యక్తి అయోమయ స్థితిలోకి జారిపోతాడు. ఇది ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలతో ముడిపడి ఉన్నప్పటికీ, కార్పొరేట్ ప్రాంగణంలోనూ ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అటు ఉద్యోగార్థులు (Job Seekers) - ఇటు యజమాన్యాలు (Employers) ఇద్దరూ కూడా ఈ వికృత ట్రెండ్‌ను వ్యాప్తి చేస్తున్నారని జాబ్‌లీడ్స్ (JobLeads) కంపెనీ చేసిన స్టడీలో తేలింది.
యాజమాన్యాల్లో ఘోస్టింగ్ బిహేవియర్
జాబ్‌లీడ్స్ చేసిన అధ్యయనం ప్రకారం, 45 శాతం మంది ఉద్యోగ దరఖాస్తుదార్లు సదరు యజమాన్యాల నుంచి ఘోస్టింగ్ బిహేవియర్‌ను అనుభవించారు. అంతేకాదు, ఇటీవలి సంవత్సరాలలో ఈ పోకడ గణనీయంగా 30 శాతం పెరిగింది. ఎంప్లాయర్స్ చేసే ఘోస్టింగ్ ఎలా ఉంటుందంటే.. కంపెనీలో ఖాళీలు లేకపోయినా జాబ్ అడ్వర్‌టైజ్‌మెంట్ ఇస్తారు. ఆశతో వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. కానీ, ఆ తర్వాత గప్‌చుప్ అయిపోతారు. ఇంటర్వ్యూకు హాజరైన ఉద్యోగార్థులకు ఏ విషయం చెప్పరు. వారు కాల్ చేసినా, మెయిల్ చేసినా రిప్లై ఇవ్వరు. కంపెనీ తరపు నుంచి అసలు ఎలాంటి కమ్యునికేషన్ ఉండదు. దీనివల్ల, చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూల తర్వాత నిస్సత్తువలో కూరుకుపోతున్నారు. తాము ఉద్యోగానికి పనికిరామన్న భ్రమలు ఉద్యోగుల్లో పెరుగుతున్నాయట. కంపెనీలు ఖాళీలు లేకపోయినా ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడాన్ని "ఘోస్ట్ జాబ్ పోస్టింగ్స్"గా పిలుస్తారు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాలెంట్‌ను అంచనా వేయడానికి, కంపెనీలో వృద్ధిపై అవగాహన పెంచుకోవడానికి ఆయా కంపెనీలకు "ఘోస్ట్ జాబ్ పోస్టింగ్స్" ఉపయోగపడతాయి.
ఉద్యోగార్ధుల్లో ఘోస్టింగ్ బిహేవియర్
ఆసక్తికమైన విషయం ఏంటంటే, కొందరు ఉద్యోగార్ధుల్లో కూడా ఘోస్టింగ్ బిహేవియర్ ఉంది. జాబ్ కోసం అప్లై చేసుకున్నప్పటికీ, ఇంటర్వ్యూను స్కిప్ చేసినట్లు UKలోని 93 శాతం జెన్ Z ఉద్యోగార్థులు చెబుతున్నారు. అంతేకాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత, 87 శాతం మంది మొదటి రోజే జాబ్‌కు వెళ్లకుండా మొహం చాటేశారట. ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే... ఆ ఉద్యోగంపై వాళ్లకు ఆసక్తి లేదట. వాళ్ల ఆర్థిక అవసరాలు లేదా వ్యక్తిగత అంచనాలను అందుకోలేని జాబ్ పొజిషన్లకు కట్టుబడి ఉండటానికి జెన్ Z ఇష్టపడడం లేదు. అంతేకాదు.. జీతం, పొజిషన్, ప్రమోషన్ల వంటివి సంతృప్తికరంగా లేకపోతే అప్పటికప్పుడు జాబ్‌కు గుడ్‌బై చెప్పడానికి ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారని స్టడీలో తేలింది. ఉద్యోగుల్లో కనిపిస్తున్న ఈ తరహా వైఖరి ఆ కంపెనీ యాజమాన్యాన్ని అయోమయంలో పడేస్తుంది.
యజమానుల నుంచి పారదర్శకత, సంతృప్తికరమైన జీతాలు & ప్రయోజనాలు అందితే, ఈ దెయ్యం కంపెనీలను వదిలేసి వెళ్లిపోతుందని జాబ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరో ఆసక్తిర కథనం: ఫుడ్ డెలివరీ అంటే ఒక్క జొమాటోనే కాదు, ఇవీ కూడా ఉన్నాయి ఓ లుక్ వేయండి