Budget Halwa: బడ్జెట్ హల్వా - ఇది ఎక్కడ దొరుకుతుంది, దాని స్పెషాలిటీ ఏంటి?
Budget 2025: 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కోసం కేంద్ర సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 01 ఫిబ్రవరి 2025న పార్లమెంట్‌కు సమర్పిస్తారు.

Halwa Ceremony Before Budget: కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియలో హల్వా వేడుకకు ఒక విశిష్టత ఉంది. దశబ్దాలుగా వస్తున్న వేడుక ఇది. బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు వచ్చిందని సూచించే ఒక సంప్రదాయం & బడ్జెట్ టీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ ప్రారంభమయ్యే టైమ్ ఇది. ప్రతి సంవత్సరం, బడ్టెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రారంభించే ముందు హల్వా తయారీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), సహాయ మంత్రి పంకజ్ చౌదరి నాయకత్వం వహిస్తారు.
హల్వా వేడుక అంటే ఏమిటి?
కేంద్ర బడ్జెట్ 2025-26 బడ్జెట్ తయారీ ప్రాసెస్ క్లైమాక్స్‌కు చేరుకుందని గుర్తు చేసే హల్వా వేడుక శుక్రవారం (24 ఫిబ్రవరి 2025) సాయంత్రం న్యూదిల్లీలోని నార్త్ బ్లాక్ (North Block)లో ప్రారంభం అవుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ, సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు.. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొంటున్న అధికారులు & సిబ్బంది కూడా ఈ వేడుకకు హాజరవుతారు.
ఈ రాబోయే బడ్జెట్ సమర్పణతో, ఆర్థిక మంత్రి సీతారామన్ ఏడో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 1959 - 1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్‌లు & ఒక తాత్కాలిక బడ్జెట్‌ను సమర్పించిన మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును ఆమె ఇప్పటికే అధిగమించారు.
హల్వా వేడుకను ఎలా సెలబ్రేట్ చేస్తారు?
హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి, సహాయ మంత్రి, అధికారులు పాల్గొని హల్వా తింటారు. హల్వానే ఎందుకు పెడతారంటే, నోరు తీపి చేసుకునే మంచి పనికి సూచనగా అందరికీ హల్వా వడ్డిస్తారు. సంప్రదాయం ప్రకారం, నార్త్ బ్లాక్‌లోని పెద్ద 'కడాయి' (పాత్ర)లో ఈ భారతీయ సంప్రదాయ తీపి వంటకాన్ని తయారు చేసి, ఆపై బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న వారందరికీ వడ్డిస్తారు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, వేడుకలో భాగంగా 'కడాయి'లోని గరిటతో హల్వాను అటు, ఇటు తిప్పుతారు. అంటే, ఆ వంటకాన్ని ఆమే వండారని భావించడం దీని అర్ధం. తర్వాత, ఆమె ఆర్థిక శాఖ ముఖ్య అధికారులకు స్వయంగా హల్వా అందజేస్తారు.
హల్వా వేడుక ప్రాముఖ్యత
హల్వా వేడుక ఒక ముఖ్యమైన సమావేశం వంటిది. ఇది, ఆర్థిక మంత్రిత్వ శాఖలో "లాక్‌డౌన్" ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. లాక్‌డౌన్ కాలంలో, బడ్జెట్‌తో సంబంధం ఉన్న అందరు అధికారులు & సిబ్బంది పార్లమెంట్ నార్త్ బ్లాక్‌కే పరిమితం అవుతారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ పత్రాలను పార్లమెంటులో సమర్పించే వరకు, వాళ్లంతా మంత్రిత్వ శాఖ ప్రాంగణాన్ని వదిలి వెళ్ళడానికి అనుమతి లేదు. కుటుంబ సభ్యులు సహా బయటి వ్యక్తులతో మాట్లాడడానికి వీలుండదు. ఒక విధంగా, అధికారులు &సిబ్బంది ఫిబ్రవరి 01 వరకు జైలు జీవితాన్ని గడుపుతారు.
బడ్జెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ, 1980లో, రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhawan) నుంచి నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లోకి మారింది. బడ్జెట్ తయారీలో జట్టు కృషిని చాటేలా కూడా ఈ సంప్రదాయం జరుపుకుంటున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. జనవరి 31న, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రెండో విడత సమావేశాలు మార్చి 10న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 04 వరకు కొనసాగుతుంది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?





















