UltraTech Cement Q2 Results: అల్ట్రాటెక్ సిమెంట్ నెత్తిన వ్యయాల భారం, లాభంలో 42% మాయం!
సిమెంట్ కంపెనీ ఏకీకృత నికర లాభం 38 శాతం తగ్గుతుందని మార్కెట్ అంచనా వేసింది. ఈ అంచనాల కంటే వాస్తవ పరిస్థితి ఘోరంగా ఉంది.
UltraTech Cement Q2 Results: ఆదిత్య బిర్లా (Aditya Birla) గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, బుధవారం, మార్కెట్‌ను నిరాశ పరిచింది. ఈ కంపెనీ వాస్తవ అంకెలు మార్కెట్ అంచనాలను అందుకోలేదు. అధిక వర్షాల వల్ల నిర్మాణాలు ఆగి సిమెంట్ డిమాండ్ తగ్గడం, పెరిగిన విద్యుత్ & ఇంధన ధరల వల్ల కంపెనీ ఆదాయం బాగా దెబ్బతింది.
ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23), ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) 42 శాతం క్షీణించి ₹756 కోట్లకు దిగి వచ్చింది. క్రితం సంవత్సరం ఇదే త్రైమాసికంలో ₹1,314 కోట్లను ఈ సిమెంట్ జెయింట్ సాధించింది.
వాస్తవ పరిస్థితి ఘోరం
సిమెంట్ సెక్టార్ పరిస్థితులు ఆశాజనకంగా లేని నేపథ్యంలో, ఈ సిమెంట్ కంపెనీ ఏకీకృత నికర లాభం 38 శాతం తగ్గుతుందని మార్కెట్ అంచనా వేసింది. ఈ అంచనాల కంటే వాస్తవ పరిస్థితి ఘోరంగా ఉంది.
సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15% పెరిగి ₹13,893 కోట్లకు చేరుకుంది, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.12,016.78 కోట్లుగా ఉంది, అల్ట్రాటెక్ సిమెంట్ BSE ఫైలింగ్‌లో తెలిపింది.
తగ్గిన ఆపరేటింగ్ మార్జిన్
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (ఆపరేటింగ్ రెవన్యూ) గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 12,016.78 కోట్ల నుంచి ఈసారి 15.61 శాతం పెరిగి రూ. 13,893 కోట్లకు చేరిందని BSE ఫైలింగ్‌లో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ పేర్కొంది.
ఫ్లైయాష్, స్లాగ్, జిప్సమ్, బ్లెండెడ్ ఫ్యూయల్, పెట్‌కోక్ ధరలు పెరగడం వల్ల వడంతో కంపెనీపై అధిక భారం పడిందని వెల్లడించింది. ఇంధన వ్యయాలు 58 శాతం, ముడి పదార్థాల వ్యయాలు 18 శాతం పెరగాయని, దీంతో మొత్తం నిర్వహణ వ్యయాలు కూడా పెరిగాయని వెల్లడించింది. కంపెనీ మొత్తం వ్యయాలు గత ఏడాదిలోని రూ.10,209.43 కోట్ల నుంచి 26.68 శాతం పెరిగి రూ. 12,934.27 కోట్లకు చేరాయి. ఫలితంగా, నిర్వహణ మార్జిన్ (ఆపరేటింగ్ మార్జిన్) గత ఏడాదితో పోలిస్తే సమీక్ష కాల త్రైమాసికంలో 14 శాతం తగ్గిందని కంపెనీ ప్రకటించింది.
జులై, ఆగస్టులో సిమెంట్ డిమాండ్ తక్కువగా ఉంది. దీపావళికి ముందు నిర్మాణాలు, మరమ్మత్తు పనులు ఊపందుకోవడం వల్ల రిటైల్ డిమాండ్ సెప్టెంబర్‌లో పుంజుకుంది. ఇప్పుడు పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి - అల్ట్రాటెక్ మేనేజ్‌మెంట్
ఏకీకృత (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) విక్రయాలు 7 శాతం పెరిగి 23.10 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి. అధిక వర్షాలు ఉన్నా, దేశీయంగా విక్రయాలు 9.6 శాతం పెరిగాయి.
కెపాసిటీ యుటిలిటీ విషయానికి వస్తే.. Q2FY22లోని 71 శాతం నుంచి Q2FY22లో 76 శాతానికి సామర్థ్యం వినియోగాన్ని ఈ సిమెంట్ మేజర్ సాధించింది.
బుధవారం రూ. 6398 దగ్గర క్లోజయిన అల్ట్రాటెక్ సిమెంట్ షేరు ధర, ఇవాళ (గురువారం) రూ. 6,340 వద్ద నష్టంతో ప్రారంభమైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.