Mobile Tariff Hike In 2023: మొబైల్ మాటలు మరింత ఖరీదు కావచ్చు, రేట్ల పెంపునకు రెడీగా ఉన్న టెలికాం కంపెనీలు
అటు ప్రి-పెయిడ్ - ఇటు పోస్ట్ పెయిడ్ ఇలా రెండు రూపాల్లోనూ ధరల పెంపును కాల్ ప్రొవైడర్లు ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి.
![Mobile Tariff Hike In 2023: మొబైల్ మాటలు మరింత ఖరీదు కావచ్చు, రేట్ల పెంపునకు రెడీగా ఉన్న టెలికాం కంపెనీలు telecom-companies-Likely-to-raise-tariffs-in-2023-as per IIFL Securities report Mobile Tariff Hike In 2023: మొబైల్ మాటలు మరింత ఖరీదు కావచ్చు, రేట్ల పెంపునకు రెడీగా ఉన్న టెలికాం కంపెనీలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/03/b9448b05fdeca5486b3e11c831a1418e1672713536594545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mobile Tariff Hike In 2023: దేశంలో మొబైల్ సేవలు అందిస్తున్న ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలు (రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా) కొత్త ఏడాదిలో టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధంగా కనిపిస్తున్నాయి. దేశంలో 5G టెలికాం సర్వీసులను (5G Service) అందించడానికి... స్పెక్ట్రం కొనుగోలు, సంబంధిత సాంకేతికత కోసం లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ఈ టెలికాం సంస్థలు వెచ్చిస్తున్నాయి. ఈ డబ్బులను భారత ప్రభుత్వానికి చెల్లించేందుకు, పనిలో పనిగా తాము కూడా లాభాల్లో కొనసాగేందుకు కాల్ రేట్లను పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈసారి, అటు ప్రి-పెయిడ్ - ఇటు పోస్ట్ పెయిడ్ ఇలా రెండు రూపాల్లోనూ ధరల పెంపును కాల్ ప్రొవైడర్లు ప్రకటించవచ్చని అంచనాలు ఉన్నాయి.
ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ నివేదిక
బ్రోకరేజ్ హౌస్ ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ (IIFL Securities), టెలికాం టారిఫ్స్ పెంపు మీద ఒక నివేదికను విడుదల చేసింది. 5Gతో అనుబంధానమైన 'ఒక్కో వినియోగదారు సగటు ఆదాయాన్ని' (Average Revenue Per User - ARPU) తక్షణం పెంచుకోవడం టెలికాం కంపెనీలకు కుదిరే పని కాదు. కాబట్టి, 4G టారిఫ్‌లను పెంచడం తప్ప వేరే వాటికి మార్గం లేదు. 2024లో లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు సమీపంలో... అంటే 2023 చివరిలో, లేదా 2024 ప్రారంభంలో టారిఫ్‌లను పెంచడం వల్ల రాజకీయ ఆరోపణలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. కాబట్టి, 2023 మధ్య కాలంలోనే 4G టారిఫ్‌ల పెంపును ప్రజలు భరించాల్సి వస్తుందని బ్రోకింగ్ హౌస్ విశ్వసిస్తోంది.
తన రుణాన్ని వొడాఫోన్ ఐడియా తిరిగి చెల్లించడానికి కనీసం 25 శాతం టారిఫ్‌ను పెంచాల్సి ఉంటుందని, అలాగే, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను 2027 నాటికి క్లియర్ చేయడానికి టారిఫ్‌ను భారీగా పెంచాల్సి ఉంటుందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ (Kotak Institutional Equities) కూడా తన నివేదికలో పేర్కొంది. పోస్ట్ పెయిడ్ టారిఫ్‌లు కూడా పెరిగే అవకాశం ఉందని ఈ బ్రోకరేజ్ హౌస్ అభిప్రాయపడింది.
కొన్ని రోజుల క్రితమే, భారత్‌లో టెలికాం టారిఫ్‌ల మీద విదేశీ బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్‌లోని (Jefferies) విశ్లేషకులు కూడా ఒక నివేదిక విడుదల చేశారు. టెలికాం కంపెనీలు కొత్త సంవత్సరంలో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని ఆ నివేదికలో వాళ్లు వెల్లడించారు. 2020-23, 2023-24, 2024-25 నాలుగో త్రైమాసికాల్లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని తెలిపారు. 5G పెట్టుబడుల కారణంగా కంపెనీల ఆదాయం, మార్జిన్ల మీద మళ్లీ ఒత్తిడి పెరుగుతోందని, ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి టారిఫ్‌లు పెంచడం తప్ప టెలికాం కంపెనీలకు మరో మార్గం లేదని నివేదికలో పేర్కొన్నారు.
రిలయన్స్ జియో (Reliance Jio), భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) దేశంలోని అనేక నగరాల్లో ఇప్పటికే 5G సేవలను ప్రారంభించాయి. వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఇంకా ప్రారంభించలేదు. ఈ 3 టెలికాం కంపెనీలు 5G స్పెక్ట్రం కోసం వేలంలో రూ. 1,50,173 కోట్లు వెచ్చించాయి. ఈ లైసెన్స్ ఫీజును చెల్లించేందుకు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)