Tax On Online Gaming: ఆన్‌లైన్ గేమింగ్‌లో ఎంత మొత్తంపై TDS ఉండదు?
ఆన్‌లైన్ గేమింగ్‌లో వచ్చే బోనస్, రెఫరల్ బోనస్, ఇన్సెంటివ్స్ సహా ఏ రకమైన ప్రోత్సాహకం అయినా ఐటీ రాడార్‌లోకి వస్తుంది.
TDS On Online Gaming Winnings: ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలిచిన మొత్తాలపై TDSకు సంబంధించి క్లారిటీ ఇస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) మార్గదర్శకాలు జారీ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా గెలిచిన మొత్తంపై పన్ను కట్ చేయడానికి రూ. 100ను థ్రెషోల్డ్‌గా నిర్ణయించింది. బోనస్, రెఫరల్ బోనస్, ఇన్సెంటివ్స్ అన్నీ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లో 'పన్ను విధించదగిన మొత్తం'గా ఇకపై లెక్కలోకి వస్తాయి. ఈ రూల్ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తిస్తుంది.
మార్గదర్శకాలు ఏంటి?
డైరెక్ట్ టాక్స్‌ల బోర్డ్ గైడ్‌లైన్స్ ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఒక యూజర్ ఒక నెలలో రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే ఆదాయంపై TDS (Tax Deducted at Source) చెల్లించాలి. దీనిని సదరు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ కట్ చేస్తుంది. ఆన్‌లైన్ గేమింగ్‌లో వచ్చే బోనస్, రెఫరల్ బోనస్, ఇన్సెంటివ్స్ సహా ఏ రకమైన ప్రోత్సాహకం అయినా ఐటీ రాడార్‌లోకి వస్తుంది. ఇలాంటి వాటి ద్వారా ఒక ప్లేయర్ డబ్బు సంపాదిస్తే, అది TDS చెల్లించాల్సిన 'పన్ను విధించదగిన మొత్తం'గా లెక్కిస్తారు. కొన్ని గేమింగ్ కంపెనీలు ఇచ్చే ప్రోత్సాహకాలు కాయిన్ డిపాజిట్స్, కూపన్లు, ఓచర్లు, కౌంటర్ల రూపంలో ఉండవచ్చు. వాటన్నింటినీ పన్ను విధించదగిన డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఆన్‌లైన్ గేమింగ్ ఫ్లాట్‌ఫామే TDS తీసివేసి మిగిలిన మొత్తాన్ని యూజర్‌కు చెల్లిస్తుంది.
ఆన్‌లైన్ గేమింగ్‌లో ఒక ప్లేయర్ ఒక నెలలో రూ. 100 కంటే తక్కువ డబ్బు గెలిస్తే, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ TDS తీసివేయాల్సిన అవసరం లేదు.
ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉంటే?
CBDT రూల్ 133 ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలో ఒక కస్టమర్ తన ఖాతాను ఏ పేరుతో రిజిస్టర్ చేసినా, ఏదైనా పన్ను విధించదగిన డిపాజిట్, నాన్ టాక్సబుల్ డిపాజిట్, గెలిచిన మొత్తం క్రెడిట్ చేసినా లేదా వెనక్కు తీసుకున్నా (డెబిట్) అతనికి అన్ని రూల్స్ వర్తిస్తాయి. ఒకే కస్టమర్‌కు ఒకటి కంటే ఎక్కువ గేమింగ్ అకౌంట్లు ఉంటే, అతని ఖాతాల్లో ప్రతి ఒక్కటి లెక్కలోకి వస్తుంది. ఆయా అకౌంట్ల ద్వారా గెలుచుకున్న డబ్బు మొత్తం ఐటీ రూల్స్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. కస్టమర్ ఖాతాలో డిపాజిట్లు, డెబిట్లు, లేదా బ్యాలెన్స్ అన్నీ ఐటీ పరిధిలోకి వస్తాయి.
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా పన్ను అధికారుల కనుసన్నల్లో ఉంది. ఈ రకమైన లావాదేవీలను ట్రాక్ చేసే లక్ష్యంతో, ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2023 ద్వారా ఆదాయ పన్ను చట్టం-1961లో కొత్త సెక్షన్ 194BAని చొప్పించింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా ఒక గేమర్ ఖాతాలోని నెట్ విన్సింగ్స్‌పై (నికరంగా గెలిచిన మొత్తం) ఆదాయ పన్నును తీసివేయాల్సిన రూల్‌ను ఈ కొత్త సెక్షన్ తీసుకొచ్చింది. సెక్షన్ 194BA ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే నికర మొత్తంపై 30 శాతం చొప్పున TDS కట్ అవుతుంది.
ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 2023-24 ఆదాయపు పన్ను డిక్లరేషన్‌లో గేమర్లు ప్రకటించాల్సి ఉంటుంది.
మార్చిలో జరిగిన ఫైనాన్స్ బిల్లు సవరణల్లో, ఆన్‌లైన్ గేమింగ్ కోసం TDS ప్రొవిజన్ వర్తించే తేదీని ముందుగా ప్రతిపాదించిన జులై 1, 2023 నుంచి ఏప్రిల్ 1, 2023కి ఆర్థిక శాఖ మార్చింది.
గేమర్స్ నుంచి కలెక్ట్ చేసిన 30 శాతం పన్నును ఈ ఏడాది ఏప్రిల్‌లో డిపాజిట్ చేయని ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు CBDT ఒక అవకాశం ఇచ్చింది. ఏప్రిల్ నెల పన్నును, మే నెల పన్నును కలిపి జూన్ 7వ తేదీ లోగా జమ చేయవచ్చని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే సదరు కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.