Taliban Crisis: తాలిబన్లు.. ఎంత పనిచేశారయా? భారత్ లో రేట్లు ఆకాశానికే!
తాలిబన్లు భారత్- అఫ్గానిస్థాన్ మధ్య వ్యాపారాలను నిలిపివేశారు. ఈ కారణంగానే మన దేశంలో డ్రై ఫ్రూట్స్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. మరి ఎప్పుడు వ్యాపారం పునరుద్ధరణ జరుగుతుంది?
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఎగుమతులు, దిగుమతులను తాలిబన్లు నిలపివేశారు. ఆగస్టు 15 న అఫ్గానిస్థాన్ ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రభావం భారత మార్కెట్ పై పడనుంది. కొన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో మీరే చూడండి.
రెండు దేశాల మధ్య..
భారత్- అఫ్గానిస్థాన్ మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. భారత్ నుంచి పంచదార, టీ, కాఫీ పొడి, దుస్తులు, ఫార్మాసూటికల్స్, ట్రాన్సిమిషన్ పవర్స్, చెర్రీ, పుచ్చకాయ, ఆరోగ్య మూలికలు ఎగుమతి అవుతాయి.
అఫ్గానిస్థాన్ నుంచి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ భారత్ కు దిగుమతి అవుతాయి. దేశంలోని 85 శాతం డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్థాన్ నుంచే భారత్ కు వస్తాయి. ఉల్లిపాయలు, ఎండి ద్రాక్ష, గమ్ము, ఇంగువ, జీలకర్ర కూడా భారత్ కు అఫ్గానిస్థాన్ ఎగుమతి చేస్తోంది.
ప్రతి ఏడాది దాదాపు 38 వేల టన్నుల డ్రై ఫ్రూట్స్ అఫ్గానిస్థాన్ నుంచి భారత్ కు వస్తాయని డ్రై ఫ్రూట్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ భూటా తెలిపారు.
ఇంక ఇంతేనా..
అఫ్గానిస్థాన్ కు భారత్ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2021లో 835 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అఫ్గానిస్థాన్ కు భారత్ ఎగుమతి చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ) అజయ్ సహాయ్ ఏఎన్ఐకు తెలిపారు. వివిధ ప్రాజెక్టులకు గాను అఫ్గానిస్థాన్ లో దాదాపు 3 మిలియన్ డాలర్లు భారత్ పెట్టుబడి పెట్టింది.
రాబోయే అఫ్గాన్ ప్రభుత్వంలో కూడా ఇరుదేశాల మధ్య వ్యాపారం ఇలానే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక అభివృద్ధి ద్వారా మాత్రమే దేశం ముందుకు వెళ్తుందని అఫ్గానిస్థాన్ త్వరలోనే తెలుసుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. ఇరు దేశాల మధ్య ఎప్పటిలానే వ్యాపారం సాగుతుంది. కొత్త ప్రభుత్వం సైతం అఫ్గానిస్థాన్ అభివృద్ధిలో భారత్ పాత్రను గుర్తిస్తుంది.
అజయ్ సహాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ)
ఎందుకు నిలిపివేశారు?
పాకిస్థాన్ కు కార్గో రవాణాను తాలిబన్లు నిలిపివేయడం వల్లే అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతులు ఆగిపోయాయని అజయ్ తెలిపారు. పాకిస్థాన్ మీదుగానే భారత్ కు అప్గాన్ దిగుమతులు వస్తాయి.
అఫ్గానిస్థాన్ లో జరిగే పరిణామాలును మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. పాకిస్థాన్ మీదుగానే అక్కడి నుంచి దిగుమతులు భారత్ కు వస్తాయి. పాకిస్థాన్ కు కార్గో రవాణాను తాలిబన్లు నిలిపివేయడం వల్లే ఇరు దేశాల మధ్య వ్యాపారం నిలిచిపోయింది.
అజయ్ సహాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఐఈఓ)