Sula Vineyard IPO: రుచించని సూలా వైన్ - ఫ్లాట్ లిస్టింగ్, ఆ వెంటనే సెల్లింగ్ ప్రెజర్
ఈ స్క్రిప్ రూ. 348.5 కి పడిపోయింది. లిస్టింగ్ ప్రైస్ నుంచి ఇది 2.65 శాతం లేదా రూ. 9 తగ్గుదల.
Sula Vineyard IPO: స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితి మధ్య, ఇవాళ (గురువారం, 22 డిసెంబర్ 2022) అరంగేట్రం చేసిన సూల వైన్‌యార్డ్స్ షేర్లు ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. IPO ఇష్యూ ధర రూ. 357తో పోలిస్తే, సూల వైన్యార్డ్ షేర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో (BSE) రూ. 358 వద్ద మార్కెట్‌లోకి ప్రవేశించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఈ స్క్రిప్ రూ. 348.5 కి పడిపోయింది. లిస్టింగ్ ప్రైస్ నుంచి ఇది 2.65 శాతం లేదా రూ. 9 తగ్గుదల.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో (NSE) 1.14 ప్రీమియంతో రూ. 361 వద్ద షేర్లు లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్ తర్వాత ఇక్కడ కూడా ధర పడిపోయింది. మార్కెట్ అరంగేట్రానికి ముందు, సూల వైన్యార్డ్ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 15 డిస్కౌంట్‌తో ట్రేడ్ అయ్యాయి కాబట్టి, నిరాశపూరిత లిస్టింగ్‌ను మార్కెట్ ముందే ఆశించింది.
సూల వైన్‌యార్డ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (IPO) 2022 డిసెంబర్ 12 -14 తేదీల మధ్య కొనసాగింది. ఈ ఇష్యూ మొత్తం 2.33 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. QIB విభాగం 4.12 రెట్ల సభ్యత్వం పొందగా, రిటైల్ పెట్టుబడిదారుల భాగం 1.65 రెట్లు స్పందన అందుకుంది.
రూ. 960 కోట్ల విలువైన ఇష్యూ కోసం, వైన్ మేకర్ కంపెనీ 2.69 కోట్ల షేర్లను IPOలో ఆఫ్‌లోడ్ చేసింది. ఇవి మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (OFS) షేర్లు. ఫ్రెష్ షేర్ ఒక్కటి కూడా లేదు. ప్రమోటర్, ఇన్వెస్టర్లు, ఇతర వాటాదారులు కలిసి 1,88,30,372 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్‌లో మార్కెట్‌లోకి తీసుకురాగా, 4,38,36,912 షేర్ల కోసం కంపెనీకి అప్లికేషన్స్ అందాయి. IPO ప్రారంభానికి ముందు రోజు, 22 మంది యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 288.10 కోట్లను ఈ వైన్ మేకర్ & సెల్లర్ సేకరించింది.
ఇప్పుడు ఎలాంటి స్ట్రాటెజీ ఫాలో అవ్వాలి?
లిస్టింగ్ గెయిన్స్ కోసం IPOలో పెట్టుబడి పెట్టిన మదుపర్లు, రూ. 350 వద్ద స్టాప్ లాస్ ఉంచాలి. షేర్లు రూ. 380 మార్క్ దాటే వరకు వేచి ఉండాలని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ సూచించారు.
31 మార్చి 2022 నాటికి సూల వైన్‌యార్డ్స్ భారత దేశంలో అతి పెద్ద వైన్ ఉత్పత్తి & విక్రయ కంపెనీ. Sula (కంపెనీ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్), RASA, Dindori, The Source, Satori, Madera & Dia వంటి బ్రాండ్లతో వైన్ పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీకి మహారాష్ట్ర, కర్ణాటకలో నాలుగు సొంత, రెండు లీజు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో, 56 లేబుల్స్‌తో 13 విభిన్న బ్రాండ్ల వైన్‌లను ఉత్పత్తి చేస్తోంది.
2022 సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి, సూల వైన్‌యార్డ్స్ నెత్తిన రూ. 231.5 కోట్ల రుణాలు ఉన్నాయి. రూ. 13 కోట్ల నగదు, నగదు సమాన ఆస్తులు ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.