Stock Market Closing: అమ్మకాలతో అల్లాడించిన ఫారిన్ ఇన్వెస్టర్లు - దారుణంగా దెబ్బతిన్న మిడ్, స్మాల్ క్యాప్స్
FII Sales In Stock Markets: ఈ రోజు సెషన్‌లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విదేశీ పెట్టుబడిదార్లు వీసమెత్తు కనికరం కూడా చూపకుండా అమ్మకాలకు దిగారు.
Stock Market Closing Today: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 07 అక్టోబర్ 2024) ప్రారంభ లాభాలను వదులుకున్నాయి, 'బ్లాక్ మండే'ని చూశాయి. చైనాలో ఉద్దీపన ప్యాకేజీలు, ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో ఫారిన్ ఇన్వెస్టర్లు (FIIs) అమ్మకాలకే మొగ్గు చూపారు. దీంతో, భారతీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్‌లోనూ రెడ్ జోన్‌లో ముగిసింది. బ్యాంకింగ్, ఇంధనం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు పతనమయ్యాయి.
మార్కెట్ ముగిసిన సమయానికి, BSE 638.45 పాయింట్లు లేదా 0.78% పడిపోయి 81,050 వద్ద ఉంది. NSE నిఫ్టీ 218.85 పాయింట్లు లేదా 0.87% తగ్గి 24,795.75 వద్ద ఆగాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 81,926.99 దగ్గర, నిఫ్టీ 25,084.10 దగ్గర ఓపెన్ అయ్యాయి.
ఫియర్ ఇండెక్స్ India VIX 6.74 శాతం పెరిగి 15.08 వద్ద ముగిసింది.
పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 7 స్టాక్స్ లాభాల్లో ముగిస్తే, 23 నష్టాల వాకిట్లో నిలిచాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 10 స్టాక్స్ ప్రాఫిట్స్ సాధించగా, 40 లాస్‌లతో వెనుకబడ్డాయి. టాప్ గెయినర్స్‌లో... మహీంద్రా అండ్ మహీంద్రా 1.46 శాతం, ఐటీసీ 1.40 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.31 శాతం, ఇన్ఫోసిస్ 0.80 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.74 శాతం, టీసీఎస్ 0.26 శాతం, టెక్ మహీంద్రా 0.14 శాతం చొప్పున పెరిగాయి. టాప్ లూజర్స్‌లో... అదానీ పోర్ట్స్ 4.08 శాతం, ఎన్‌టీపీసీ 3.50 శాతం, ఎస్‌బీఐ 2.96 శాతం, పవర్ గ్రిడ్ 2.92 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.43 శాతం పతనంతో ముగిశాయి.
సెక్టార్ల వారీగా...
నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మినహా అన్ని రంగాల సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. PSU బ్యాంక్, మీడియా సూచీలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి, తలో 3 శాతానికి పైగా జారిపోయాయి. ఆ తర్వాత OMCs, మెటల్ సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి. నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ 2.52 శాతం లేదా 1050 పాయింట్ల పతనమైంది. బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పైగా లోయర్ సైడ్‌లో స్థిరపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 837 పాయింట్లు లేదా 1.63 శాతం క్షీణతతో ముగిసింది.
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అన్నింటికంటే ఎక్కువ దెబ్బతిన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1170 పాయింట్లు 2.01 శాతం పడిపోయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 495 పాయింట్లు లేదా 2.75 శాతం క్షీణించింది.
మార్కెట్ క్యాప్
స్టాక్ మార్కెట్‌లో ఆల్ రౌండ్ సేల్స్ కారణంగా ఇన్వెస్టర్లు భారీ నష్టాలను చవిచూశారు. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ (Market Capitalization Of Indian Stock Market) గత సెషన్‌లో రూ. 460.89 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు రూ. 452.20 లక్షల కోట్ల వద్ద ముగిసింది. ఈ ఒక్క రోజే ఇన్వెస్టర్ల సంపద రూ. 8.69 లక్షల కోట్లు ఆవిరైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్ర అస్వస్థతకు గురయ్యారా? ఐసీయూలో చికిత్స పొందుతున్నారా?