Stock Market Updates: తగ్గేదే లే! ఫైర్‌లో కనిపిస్తున్న ఇన్వెస్టర్లు.. సెన్సెక్స్ మళ్లీ 60000+
వరుసగా మూడో సెషన్లోనూ కీలక సూచీలు భారీ స్థాయిల్లో లాభపడ్డాయి. బ్యాంకు, రియాల్టీ, ఆటో, ఆయిల్, గ్యాస్, మెటల్ సూచీలు 1-2 శాతం ర్యాలీ అయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ తిరిగి 60000 పై స్థాయికి చేరుకుంది.
Stock Markets updates Telugu: కొత్త ఏడాదిలో భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. వరుసగా మూడో సెషన్లోనూ కీలక సూచీలు భారీ స్థాయిల్లో లాభపడ్డాయి. బ్యాంకు, రియాల్టీ, ఆటో, ఆయిల్, గ్యాస్, మెటల్ సూచీలు 1-2 శాతం ర్యాలీ అయ్యాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్ తిరిగి 60000 పై స్థాయికి చేరుకుంది. నిఫ్టీ 17,900కు పైన ముగిసింది.
క్రితం రోజు 59,855 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,921 వద్ద స్వల్ప లాభంతో మొదలైంది. 11 గంటల సమయంలో 59,661 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సెన్సెక్స్ భారీ స్థాయిలో ర్యాలీ అయింది. 60,332 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 367 పాయింట్ల లాభంతో 60,223 వద్ద ముగిసింది.
మంగళవారం 17,805 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,820 వద్ద మొదలైంది. 17,944 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకున్న సూచీ 17,944 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 120 పాయింట్ల లాభంతో 17,925 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ దుమ్మురేపింది. ఏకంగా 817 పాయింట్లు లాభపడింది. ఉదయం 36,943 వద్ద ఆరంభమైన సూచీ 36,756 వద్ద కనిష్ఠాన్ని తాకింది. 37,862 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్న సూచీ చివరికి 37,657 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 35 కంపెనీలు లాభపడగా 15 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, జేస్‌డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్ 3 నుంచి 5 శాతం వరకు ఎగిశాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, దివిస్ ల్యాబ్, విప్రో 1 నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. ఇన్నాళ్లూ పైపైకి ఎగిసిన నిఫ్టీ ఐటీ నేడు నష్టాల్లో ముగిసింది. మదుపర్లు లాభాలను స్వీకరించడమే ఇందుకు కారణం. మిగతా రంగాల సూచీలన్నీ మెరుగ్గానే ముగిశాయి.