Stock Market Update: నిఫ్టీ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కోసం సూపర్ స్ట్రాటెజీలు ఇవిగో!
ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 17,100 స్థాయి కిందకు బ్రేక్ అయితే, 16,800-16,500 స్థాయి వరకు పడిపోవచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Stock Market Update: టెక్నికల్ చార్ట్‌లను బట్టి చూస్తే, నిఫ్టీ విషయంలో ఈ వారం అనిశ్చితి కనిపిస్తోంది. నిఫ్టీ 17,450 స్థాయిని దాటి నిలదొక్కుకుంటేనే, 17,700-18,000 దిశగా పయనించవచ్చని ఎక్స్‌పర్ట్‌లు కుండ బద్ధలు కొట్టకుండానే స్పష్టం చేశారు. ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 17,100 స్థాయి కిందకు బ్రేక్ అయితే, 16,800-16,500 స్థాయి వరకు పడిపోవచ్చని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ వారం నిఫ్టీ పరిస్థితి మీద ఇద్దరు ఎక్స్‌పర్ట్‌ల అంచనాలు ఇవి:
శ్రీరామ్ వేలాయుధన్, టెక్నికల్ అనలిస్ట్, IIFL సెక్యూరిటీస్
ఇటీవలి అప్ మూవ్‌ను ప్రధానంగా షార్ట్ కవరింగ్ లీడ్ చేసింది. గ్యాప్ జోన్ అయిన 17,429 స్థాయి దగ్గర నిఫ్టీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. గత శుక్రవారం వెలువడిన US ఉద్యోగిత రేటు వల్ల అక్కడి వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్యోల్బణం, 10 ఇయర్ బాండ్ ఈల్డ్స్, ముడి చమురు, డాలర్ ఇండెక్స్ వంటి ప్రపంచ ఆర్థిక సమాచారం ప్రభావం ఈక్విటీల మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, నిఫ్టీ 16,800 నుంచి 17,400 రేంజ్‌లో ఉండవచ్చని విశ్వసిస్తున్నాం.
ఫ్యూచర్స్ స్ట్రాటెజీ
రిస్క్ తీసుకోగల ట్రేడర్లు, 16,800 టార్గెట్‌తో 17,250 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్స్‌ను సెల్ చేయవచ్చు. 17,400 వద్ద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు.
రాజేష్ పాల్వియ, టెక్నికల్ & డెరివేటివ్స్ హెడ్, యాక్సిస్ సెక్యూరిటీస్
వీక్లీ చార్ట్‌లో, నిఫ్టీ ఇండెక్స్ రెండు వైపులా విక్స్‌తో కూడిన చిన్న బుల్లిష్ క్యాండిల్ ఏర్పాటైంది. ఇది ఏ దిశనూ సూచించడం లేదు. నిఫ్టీ 17,450 స్థాయిని దాటి కొనసాగితేనే బుల్స్ బలంగా ఉన్నాయనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది. అది ఇండెక్స్‌ను 17,700-18,000 స్థాయిల వైపు నడిపిస్తుంది. ఇండెక్స్ 17,100 స్థాయికి దిగువన బద్ధలైతే మాత్రం అడ్డగోలు అమ్మకాలు తప్పకపోవచ్చు. ఫలితంగా 16,800-16,500 వైపునకు పడిపోవచ్చు.
ఆప్షన్స్ స్ట్రాటెజీ
అక్టోబర్ 13తో ముగిసే వారానికి (వీక్లీ కాంట్రాక్ట్), బేరిష్ స్ట్రాటెజీ అయిన "పుట్ ల్యాడర్"ను ట్రేడర్లు ఫాలో అవ్వొచ్చు. దీని ప్రకారం, ఒక లాట్ 17,300 పుట్‌ను రూ.132 దగ్గర బయ్ చేయాలి. 17,050 పుట్‌ను రూ.51 వద్ద, 16,800 పుట్‌ను రూ.18 వద్ద సెల్ చేయాలి. 17,050 స్థాయి దగ్గర గరిష్టంగా రూ.9,350 లాభం రావచ్చు. 16,800 స్థాయి కంటే కింద నుంచి ఈ స్ట్రాటెజీ నష్టాల్లోకి మారుతుంది. మార్కెట్ షార్ప్‌గా ఫాల్ అయితే 16,650- 16,600 స్థాయిలో ఎగ్జిట్ అవ్వాలి. ఈ స్ట్రాటెజీకి రూ.3,150 ఖర్చవుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.