Stock market Update: రెచ్చిపోయిన బుల్స్..! బీఎస్‌ఈ సెన్సెక్స్ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+
కీలక సూచీలు రెండు వారాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. వరుసగా ఆరో నెల జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటడం, పీఎంఐ గణాంకాలు, ఆర్థిక వ్యవస్థ నష్టపోయే లాక్‌డౌన్లు లేకపోవడంతో భారీ లాభాల్లో ముగిశాయి.
భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది మొదటి ట్రేడింగ్ సెషన్లో అదరగొట్టాయి. కీలక సూచీలు రెండు వారాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. వరుసగా ఆరో నెల జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటడం, పీఎంఐ గణాంకాలు, ఆర్థిక వ్యవస్థ నష్టపోయే లాక్‌డౌన్లు లేకపోవడంతో భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా బుల్స్ రెచ్చిపోయారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 900+, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 270+ పాయింట్ల లాభాల్లో ముగిశాయి.
చివరి సెషన్లో 58,253 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,310 పాయింట్ల వద్ద ఆరంభమైంది. అక్కడి నుంచి గరిష్ఠ స్థాయి 59,266ని అందుకుంది. చివరికి 929 పాయింట్ల లాభంతో 59,183 వద్ద ముగిసింది.
శుక్రవారం 17,354 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నేడు 17,387 వద్ద మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఇంట్రాడే గరిష్ఠమైన 17,646ని తాకింది. చివరికి 271 పాయింట్ల లాభంతో 17,626 వద్ద ముగిసింది.
బ్యాంక్ నిఫ్టీ జోరు ప్రదర్శించింది. 940 పాయింట్లు లాభపడింది. ఉదయం 35,585 వద్ద ఆరంభమైన సూచీ 36,492 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 35,526 వద్ద కనిష్ఠాన్ని చేరుకున్న సూచీ చివరికి 36,421 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 40 కంపెనీలు లాభాల్లో, 9 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. ఐచర్ మోటార్స్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ 3-7 శాతం వరకు లాభపడ్డాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివిస్ ల్యాబ్, ఎం అండ్ ఎం, టెక్ మహీంద్రా 0.53 నుంచి 1.53 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి.