Mutual Funds: 10 స్టాక్స్ - 3 నెలలు - ₹32,500 కోట్లు హుష్‌కాకి - ఇలాంటివే కొంప ముంచేది!
10 స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ వదిలించుకున్న వాటాల విలువ దాదాపు రూ. 32,500 కోట్లు.
Mutual Funds: ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్ ఈక్విటీ మార్కెట్‌కు అనుకూలంగా ఉంది, ఇండెక్స్‌లు కొత్త జీవితకాల గరిష్టాలను స్కేల్ చేశాయి. అయితే, లార్జ్ క్యాప్ & మిడ్ క్యాప్ సెగ్మెంట్లలోని చాలా స్టాక్స్ బేర్ గ్రిప్‌లో చిక్కుకుని విలవిల్లాడాయి. మ్యూచువల్ ఫండ్స్ (MFలు) షేర్ హోల్డింగ్ డేటాను బట్టి, ఆ మూడు నెలల కాలంలో, MFలు కొన్న షేర్ల విలువ కంటే అమ్మిన షేర్ల విలువే ఎక్కువగా ఉంది.
జూన్ త్రైమాసికంలో, 10 స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ వదిలించుకున్న వాటాల విలువ దాదాపు రూ. 32,500 కోట్లు.
బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎక్కువ అమ్మకాలు
హెచ్‌డీఎఫ్‌సీ కవలల మెర్జర్‌కు ముందు, మ్యూచువల్ ఫండ్స్ HDFC బ్యాంక్ షేర్లను అమ్మి, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (HDFC Ltd) షేర్లను కొన్నాయి. 6,145 కోట్ల రూపాయల విలువైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లను విక్రయించి, భారీ స్థాయిలో రూ. 9,568 కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేశాయి.
మరో మూడు ఫ్రంట్‌లైన్ బ్యాంక్‌లు కూడా MF సైడ్ నుంచి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూన్ క్వార్టర్‌లో, రూ. 13,763 కోట్ల విలువైన కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను దేశీయ ఫండ్స్ వదిలించుకున్నాయి. కొటక్ బ్యాంక్‌లో MF హోల్డింగ్ మార్చి త్రైమాసికంలోని 10.99% నుంచి జూన్ త్రైమాసికం చివరి నాటికి 9.45%కి తగ్గింది. యాక్సిస్ బ్యాంక్‌లోనూ వాటి ఓనర్‌షిప్ 23.63% నుంచి 21.71%కి దిగి వచ్చింది.
ఆటోమొబైల్ సెక్టార్‌లోకి వస్తే... మహీంద్ర & మహీంద్రలో మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకున్నాయి, గత త్రైమాసికంలో రూ. 1,728 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. MFల బాధితుల లిస్ట్‌లో ఉన్న మరో ఇండెక్స్ మేజర్ భారతి ఎయిర్‌టెల్. ఈ కంపెనీలో రూ.1,661 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి.
దలాల్ స్ట్రీట్‌కు డార్లింగ్‌గా మారిన ITCని కూడా దేశీయ ఫండ్స్ విడిచిపెట్టలేదు. ఈ స్టాక్‌లో ప్రాఫిట్ బుకింగ్స్ కోసం రూ. 1,532 కోట్ల విలువైన షేర్లను అమ్మేశాయి.
మిడ్ క్యాప్ స్పేస్‌లో...
మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) కూడా మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లో కోతను చూశాయి. జూన్ త్రైమాసికంలో, మ్యూచువల్ ఫండ్స్ రూ. 3,759 కోట్ల విలువైన మ్యాక్స్ హెల్త్‌కేర్ షేర్లను, రూ. 2,349 కోట్ల విలువైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లను మార్కెట్‌లోకి తెచ్చాయి.
మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో, MFల హోల్డింగ్ మార్చి చివరి నాటికి ఉన్న 18.88% నుంచి జూన్ చివరి నాటికి 11.32%కి తగ్గింది. HALలో 8.8% నుంచి 6.64%కి దిగి వచ్చింది.
స్టవ్ క్రాఫ్ట్, ఎలిన్ ఎలక్ట్రానిక్స్, మీర్జ ఇంటర్నేషనల్, కోల్టే పాటిల్ డెవలపర్స్‌లోనూ MF హోల్డింగ్ బాగా తగ్గింది. స్టవ్ క్రాఫ్ట్‌లో వాటా 6.63% నుంచి 0.2%కి పడిపోయింది. మీర్జ ఇంటర్నేషనల్‌లో మొత్తం 4.06% వాటాను విక్రయించి, పూర్తిగా ఎగ్జిట్ తీసుకున్నాయి. రియల్టీ కంపెనీ కోల్టే పాటిల్ డెవలపర్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఓనర్‌షిప్ మార్చి త్రైమాసికంలోని 4.68% నుంచి దాదాపు పూర్తిగా తగ్గింది, జూన్ క్వార్టర్ చివరి నాటికి కేవలం 0.7% మిగిలింది.
మరో ఆసక్తికర కథనం:
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.