Share Market Opening Today: ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ - మార్కెట్లకు ఎరుపు రంగు పులిమిన బజాజ్ ట్విన్స్
'eCOM', 'Insta EMI కార్డ్' విభాగాల కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే ఆపేయాలని బజాజ్ ఫైనాన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిన్న ఆదేశించింది.
Indian Stock Market Opening Today on 16 November 2023: భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (గురువారం) ఫ్లాట్‌గా ప్రారంభమైంది, సెన్సెక్స్ & నిఫ్టీ రెడ్ కలర్‌లో ట్రేడవుతున్నాయి. బిజినెస్ ఓపెనింగ్ టైమ్‌లో.. నిఫ్టీ నిన్నటి స్థాయిలోనే ఉంది, సెన్సెక్స్ 10 పాయింట్లు దిగువన ప్రారంభమైంది. నిన్న (బుధవారం), బజాజ్ ఫైనాన్స్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినమైన నిర్ణయం (RBI Action on Bajaj Finance) తీసుకుంది. ఆ కారణంగా బజాజ్ ట్విన్స్ షేర్లు ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి, మార్కెట్‌కు ఎరుపు రంగు పులిమాయి.
ఈ రోజు మార్కెట్ ప్రారంభం ఇలా ఉంది...
నిన్న ట్రేడింగ్ ముగిసే సమయానికి 742 పాయింట్ల జంప్‌తో 65,675 వద్ద ఆగిన BSE సెన్సెక్స్, ఈ రోజు 10.06 పాయింట్ల స్వల్ప పతనంతో 65,665 వద్ద ప్రారంభమైంది. నిన్న 232 పాయింట్లు గెయిన్ అయి 19,675 వద్ద క్లోజ్ అయిన NSE నిఫ్టీ, ఈ రోజు ఫ్లాట్‌గా 19,674 వద్ద స్టార్ట్ అయింది. నిన్న నిఫ్టీలో కనిపించిన పెరుగుదల, ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఒక్క రోజులో కనిపించిన అతి పెద్ద లాభం. బ్యాంక్ నిఫ్టీ కూడా 22.80 పాయింట్లు పతనమై 44,178 స్థాయి వద్ద ఉంది.
భారీగా పడిపోయిన బజాజ్ ట్విన్స్ (Bajaj twins - Bajaj Finance, Bajaj Finserv)
'eCOM', 'Insta EMI కార్డ్' విభాగాల కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే ఆపేయాలని బజాజ్ ఫైనాన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిన్న ఆదేశించింది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రభావం ఈ రోజు బజాజ్ ట్విన్స్ షేర్లలో భారీ క్షీణత నెలకొంది. ప్రారంభ సమయానికి, బజాజ్ ఫైనాన్స్ షేర్ ప్రైస్ (Bajaj Finance Share Price) 3.93 శాతం క్షీణించి రూ.6940 స్థాయికి పడిపోయింది, తద్వారా రూ.7000 స్థాయిని కోల్పోయింది. అదే సమయానికి బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్ ధర (Bajaj Finserv Share Price) కూడా దాదాపు 3% నష్టంతో రూ.1,556 వద్ద ఓపెన్ అయింది.
ఉదయం 10 గంటల సమయానికి, BSEలో, బజాజ్ ఫైనాన్స్ షేర్ ధర రూ.72.45 లేదా 1.00% నష్టంతో రూ.7,151.85 వద్ద ఉంది. అదే సమయానికి బజాజ్ ఫిన్‌సెర్వ్ పుంజుకుంది, ఆ స్టాక్ కేవలం రూ.2.20 లేదా 0.14% నష్టంతో రూ.1,591.85 వద్ద ఉంది.
సెన్సెక్స్-నిఫ్టీ షేర్ల పరిస్థితి
ట్రేడ్ ఓపెనింగ్ టైమ్‌లో... సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 9 స్టాక్స్ మాత్రమే లాభాల్లో ఉండగా, మిగిలిన 21 స్టాక్స్ క్షీణించాయి. అదే సమయంలో, నిఫ్టీ 50 ప్యాక్‌లోని 15 స్టాక్స్‌లో పచ్చదనం కనిపించగా, 35 స్టాక్స్ ఎరుపు రంగులో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో NTPC 1.70 శాతం, TCS 0.71 శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్ 0.46 శాతం, M&M, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.42 శాతం చొప్పున పెరిగాయి.
నిఫ్టీ సెక్టార్ల పిక్చర్
నిఫ్టీ సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో... ఆయిల్ & గ్యాస్ సెక్టార్ కొద్దిగా పెరిగింది, 0.89 శాతం లాభపడింది. ఆటో, ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో గ్రీన్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మార్కెట్ ప్రారంభమైన సమయానికి మెటల్ షేర్లు గరిష్టంగా 0.56 శాతం పతనమయ్యాయి.
ఉదయం 10 గంటల సమయానికి, సెన్సెక్స్ 59.06 పాయింట్లు లేదా 0.090% లాభంతో 65,734.99 స్థాయి వద్దకు; నిఫ్టీ 18.15 పాయింట్లు లేదా 0.092% పెరిగి 19,693.60 స్థాయి వద్దకు చేరాయి.
అమెరికా-ఆసియా మార్కెట్లు
అమెరికా-చైనా అధ్యక్షులు బిడెన్-Xi సమావేశం నేపథ్యంలో, బుధవారం భారీ లాభాల తర్వాత, గురువారం ఆసియా మార్కెట్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. దీంతో ఆసియా షేర్లు ఈ రోజు లోయర్ సైడ్‌లో ఓపెన్ అయ్యాయి. ఓవర్‌నైట్‌లో, అమెరికన్ స్టాక్ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. S&P 500 0.16 శాతం పెరగ్గా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.07 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.47 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial