Stock Market News: నవంబర్ నెలలో నిఫ్టీ అడుగులు ఎటు వైపు? గత పదేళ్ల డేటా ఏం చెబుతోంది?
అక్టోబర్ నెలలో ఇప్పటివరకు ఈ హెడ్‌లైన్ ఇండెక్స్ 4 శాతం లాభపడింది.
Stock Market News: అక్టోబర్ నెల చివరి రోజున (31.10.2022) సెన్సెక్స్, నిఫ్టీ హుషారుగా ఉన్నాయి. మధ్యాహ్నం 12.55 గంటల సమయానికి ఈ రెండు బెంచ్‌మార్క్‌లు 1 శాతం పైగా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ మళ్లీ 18,000 మార్క్ అంచు వరకు వెళ్లింది, ఆ సమయానికి 17,991 పాయింట్ల వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని నమోదు చేసింది. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు ఈ హెడ్‌లైన్ ఇండెక్స్ 4 శాతం లాభపడింది. మరి నవంబర్ నెల సంగతేంటి?.
నిఫ్టీ 50-50
గత పదేళ్ల డేటాను విశ్లేషించి చూస్తే... నవంబర్ నెలలో నిఫ్టీ పరుగు 50-50గా ఉంది. ఈ పదేళ్లలో, నవంబర్ నెలలో నిఫ్టీ ఇండెక్స్ ఐదుసార్లు సానుకూల రాబడి ఇచ్చింది. కొవిడ్ మహమ్మారి విజృంభించిన 2020 నవంబర్‌లో 11.4 శాతం రిటర్న్‌తో రికార్డ్ సృష్టించింది.
2016లో ఈ ఇండెక్స్ పెట్టుబడిదారుల సంపదలో 4.65 శాతాన్ని ఆవిరి చేసి అత్యంత చెత్త రికార్డ్ తలకెత్తుకుంది.
2022 క్యాలెండర్‌లో ఇప్పటివరకు గడిచిన 10 నెలల్లో.. కేవలం నాలుగు నెలల్లో మాత్రమే స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా స్పందించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) భారీ అమ్మకాల ప్రభావంతో మిగిలిన 6 నెలలు దారుణంగా మారాయి.
2022 జూన్ 17న, నిఫ్టీ 52 వారాల కనిష్ట స్థాయి 15,183.40కి చేరింది. అక్కడి నుంచి పుంజుకుని జూలై నెలలో 8.6% అత్యుత్తమ రాబడిని అందించింది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇదే బెస్ట్ నంబర్.
US Fed నిర్ణయం కీలకం
నవంబర్ 2న US Fed మరో 75 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపునకు సిద్ధంగా ఉంది. కాబట్టి FII అవుట్ ఫ్లోలో కనిపించే వేగం మార్కెట్‌ను మలుపు తిప్పే కీలకాంశం అవుతుంది.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఇండియన్ స్టాక్స్‌ను విదేశీ మదుపుదారులు విక్రయించారు. అక్టోబర్‌లో FIIల అవుట్ ఫ్లో తగ్గింది.
2012 నుంచి... 2015, 2016, 2021 సంవతరాల్లో మాత్రమే FIIలు నవంబర్‌లో నెట్ సెల్లర్స్‌గా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 50-50 మోడ్‌లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలలో ఐదు సార్లు నవంబర్‌లో భారీ సెల్లింగ్స్ చేశాయి.
FIIల సెల్లింగ్స్ క్లైమాక్స్‌కు చేరి ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరి ఉండవచ్చు, FIIలు అతి భారీగా అమ్మారు కాబట్టి ఇక శాంతించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెబుతున్నారు. కాబట్టి మార్కెట్లలో బ్యాడ్ టైమ్ ముగిసినట్లే తాము భావిస్తున్నట్లు వివరించారు. అయితే, వచ్చే ఒకటి, రెండు త్రైమాసికాల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) డేటా ప్రకారం... FIIలు, HNIలు తమ లాంగ్ పొజిషన్లను కొనసాగించారు. దీంతో నవంబర్ F&O సిరీస్ సానుకూలంగా ప్రారంభమైంది.
ఒకవేళ నిఫ్టీలో 17,300-17,500 స్థాయుల వైపు ఏదైనా కరెక్షన్ కనిపిస్తే, లాంగ్ పొజిషన్లు పెంచుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని HDFC సెక్యూరిటీ సిఫార్సు చేసింది. 17,000 స్థాయిల దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలని టిప్ ఇచ్చింది. అప్‌సైడ్‌లో 17,900-18,100 స్థాయి తక్షణ ప్రతిఘటనగా పనిచేస్తుందని; 18,100 కంటే పైకి ఇండెక్స్ కదిలితే, ఫ్రెష్ లాంగ్ బిల్డ్-అప్స్‌తో పాటు షార్ట్ కవరింగ్ ఉంటుందని, ఇండెక్స్ మరింత చెలరేగి పోవచ్చని బ్రోకరేజ్ అంచనా వేసింది. దీనివల్ల నిఫ్టీ ఆల్-టైమ్ హై లెవెల్స్ 18,600 స్థాయిల వైపు దూసుకెళ్లవచ్చని లెక్కగట్టింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.