Stock Market News: గత 20 ఏళ్లలో ఎన్నడూ జరగనిది, నిఫ్టీలో ఇప్పుడు జరగబోతోందా?
వడ్డీ రేట్లు పెరగడంతో ఈక్విటీ మార్కెట్ కంటే డెట్ మార్కెట్ ఆకర్షణీయంగా ఉందంటూ అటు వైపు అడుగులేస్తున్నారు.
![Stock Market News: గత 20 ఏళ్లలో ఎన్నడూ జరగనిది, నిఫ్టీలో ఇప్పుడు జరగబోతోందా? Stock Market News Nifty to test 20-year-old record in March as FIIs, retail investors play bear Stock Market News: గత 20 ఏళ్లలో ఎన్నడూ జరగనిది, నిఫ్టీలో ఇప్పుడు జరగబోతోందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/28/a34596c17f5d3ab2f4d9177714c771be1677560425613545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market News: స్టాక్ మార్కెట్ ఒక సరళ రేఖలా స్ట్రెయిట్‌గా ఎప్పుడూ కదలదు. హృదయ స్పందనలను సూచించే ECG టెస్ట్ తరహాలో ఎగుడుదిగుళ్ల మధ్య సాగుతుంది. ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, గత రెండు దశాబ్దాల చరిత్రలో, నిఫ్టీ వరుసగా నాలుగు నెలల ప్రతికూల రాబడిని (negative returns) ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ, మార్కెట్‌ను కదిలించే FIIలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఇద్దరూ మడమ తిప్పడంతో, మార్చిలో ఈ చెత్త రికార్డ్‌ను నిఫ్టీ పరీక్షించే పరిస్థితి వస్తోంది.
కాడిని వదిలేసిన రెండు ఎద్దులు
సెంట్రల్ బ్యాంకులు ఊహించిన సమయం, స్థాయిలో ద్రవ్యోల్బణ నియంత్రణ సాధ్యం కాకపోవడం & వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ కొనసాగడంతో, FIIలు 2022 క్యాలెండర్ సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 34,500 కోట్ల విలువైన ఇండియన్ స్టాక్స్‌ను విక్రయించారు. దలాల్ స్ట్రీట్ సొంత సైన్యం లాంటి లాక్‌డౌన్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు గతంలో ఎప్పుడూ ఇండెక్స్‌లకు అండగా ఉన్నారు, "బయ్ ఆన్ డిప్" మంత్రాన్ని పాటించారు. ఇప్పుడు వాళ్లు కూడా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. వడ్డీ రేట్లు పెరగడంతో ఈక్విటీ మార్కెట్ కంటే డెట్ మార్కెట్ ఆకర్షణీయంగా ఉందంటూ అటు వైపు అడుగులేస్తున్నారు.
సంస్థాగతేతర పెట్టుబడిదార్ల క్యాష్ మార్కెట్ రోజువారీ సగటు వాల్యూమ్స్, 2020 మార్చి తర్వాత, ఇప్పుడు అత్యల్ప స్థాయిలో ఉన్నాయి. ప్రతికూల రాబడిని ఇస్తున్న స్టాక్ మార్కెట్ నుంచి, గత 6 నెలల్లో 38 లక్షల రిటైల్ పెట్టుబడిదార్లు నిష్క్రమించారు. వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నందున, రిస్క్ లేని ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి.
2001 రికార్డ్ రిపీట్ అవుతుందా?
2022 డిసెంబర్‌లో 3.5%, 2023 జనవరిలో 2.45% పడిపోయిన నిఫ్టీ, ఈ నెలలో ఇప్పటివరకు 1.5% విలువను కోల్పోయింది. చరిత్రను తిరగేస్తే, ఆర్థిక సంవత్సరం చివరి నెలలు (మార్చి) సానుకూలంగా ముగిశాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో, లేదో చూడాలి. ఒకవేళ నెగెటివ్ రిటర్న్ ఇస్తే మాత్రం, 20 ఏళ్ల చెత్త రికార్డ్‌ను రిపీట్ చేసినట్లు అవుతుంది.
చివరిసారి, 2001లో, జూన్-సెప్టెంబర్ కాలంలో వరుసగా 4 నెలల పాటు నిఫ్టీ ప్రతికూల రాబడిని ఇచ్చింది.
అయితే, మార్చి ఎక్స్‌పైరీ F&O డేటాను బట్టి చూస్తే, నిఫ్టీలో షార్ట్ పొజిషన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోల్-ఓవర్స్ కూడా తగ్గాయి. గత 3 నెలల సగటు 80%తో పోలిస్తే, నిఫ్టీ50 మార్చి ఫ్యూచర్స్‌కు రోల్-ఓవర్స్ 73%గా ఉన్నాయి. మార్చ్ ఫ్యూచర్స్‌లో సగటున 17860 వద్ద మేజర్ షార్ట్ రోల్స్ కనిపించాయి, ఇదే మార్చి నెలకు పివోట్ అవుతుంది. నిఫ్టీ 17860 కన్నా కింద ట్రేడ్ అయినంత వరకు, 17300 దగ్గర మద్దతు ఉంటుంది.
ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికీ ఎక్కువ ఖరీదుగా ఉన్నాయని పెద్ద పెట్టుబడిదార్లు భావిస్తున్నారు. అందువల్లే FII డాలర్లు మన మార్కెట్ నుంచి చౌక మార్కెట్లకు తరలిపోతున్నాయి. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు మన మార్కెట్ల వాల్యూయేషన్లకు చాలా స్వల్పంగా మాత్రమే మద్దతు ఇచ్చాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)