Stock Market news: సెన్సెక్స్ 1100 పాయింట్లు ఢమాల్ - కొంప కూల్చింది హిండెన్‌బర్గ్ ఒక్కటే కాదు
దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఒక్క పూటలో రూ. 8.1 లక్షల కోట్ల మేర కోల్పోయారు.
Stock Market news: గత బుధవారం రోజున 774 పాయింట్ల క్రాష్ అయిన BSE సెన్సెక్స్, వరుసగా రెండో ట్రేడింగ్ డే అయిన ఇవాళ (శుక్రవారం) కూడా 1100 పాయింట్ల వరకు పడిపోయింది. వచ్చే వారం యూనియన్ బడ్జెట్, US ఫెడ్ సమావేశం నేపథ్యంలో, దలాల్ స్ట్రీట్‌లో పెరిగిన బీపీని ప్రతిబింబిస్తూ ఫియర్ గేజ్ ఇండెక్స్ "India VIX" 13% వరకు పెరిగింది.
BSEలోని మొత్తం లిస్టెడ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ ( capitalisation) రూ. 2,68,344 లక్షల కోట్లకు పడిపోయింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఒక్క పూటలో రూ. 8.1 లక్షల కోట్ల మేర కోల్పోయారు.
నిఫ్టీ బ్యాంక్ 1,300 పాయింట్లు లేదా 3.3% పైగా నష్టపోవడంతో బ్యాంక్ స్టాక్స్ ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గత కొన్ని నెలలుగా ఔట్ పెర్ఫార్మ్ చేస్తున్న PSU బ్యాంక్ స్టాక్స్ అత్యంత దారుణంగా నష్టపోయాయి.
ఇవాళ రోజు భారత స్టాక్ మార్కెట్ దారుణ పతనానికి ప్రధాన కారకాలు ఇవి:
1) హిండెన్‌బర్గ్ ప్రభావం
అదానీ గ్రూప్ మీద ఆరోపణలతో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికను విడుదల చేసిన తర్వాత, బిలియనీర్ గౌతమ్ అదానీ సామ్రాజ్యానికి తూట్లు పడ్డాయి. గ్రూప్‌లోని మొత్తం లిస్టెడ్ 10 స్టాక్స్ ఊచకోతకు గురయ్యాయి. అదానీ టోటల్ గ్యాస్ ఇవాళ 20% వరకు నష్టపోగా, అదానీ బెల్ట్‌లోని కనీసం మూడు ఇతర స్టాక్‌లు రెండంకెల నష్టాలను చవిచూశాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, NDTV 5% లోయర్ సర్క్యూట్లలో లాక్ అయ్యాయి.
2) బ్యాంకు స్టాక్స్‌పై ఒత్తిడి
అదానీ ఉపయోగించిన విపరీతమైన పరపతి కారణంగా బ్యాంకులకు ప్రమాదం ఉందని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. దీంతో బ్యాంక్ స్టాక్‌లపై కూడా తుపాను ప్రభావం పడింది. భారతదేశంలోని అతి పెద్ద రుణదాత SBI 5% కంటే ఎక్కువ నష్టపోయింది, PSU బ్యాంక్ స్టాక్‌లు దారుణంగా దెబ్బతిన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, PNB, ICICI బ్యాంక్ ఇతర టాప్ లూజర్లలో ఉన్నాయి.
3) FII అమ్మకం
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లేదా FIIలు ఈ నెలలో అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. జనవరిలో ఇప్పటివరకు ఈక్విటీల అమ్మకం మొత్తం రూ. 16,766 కోట్లకు చేరింది. గత బుధవారం ఒక్కరోజే ఎఫ్‌ఐఐ అమ్మకాలు రూ. 2,394 కోట్లకు చేరుకున్నాయి. భారత్ నుంచి వెనక్కు తీసుకుంటున్న నిధులను చైనా వంటి చౌక మార్కెట్‌లకు మళ్లిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
4) F&O రోల్-ఓవర్స్
నిఫ్టీ నెలవారీ రోల్-ఓవర్ డేటా 79.2% వద్ద ఉంది, త్రైమాసిక సగటు 80.1% కంటే కొంచెం తక్కువగా ఉంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో FIIల లాంగ్ పొజిషన్లు గత ఎక్స్‌పైరీ నుంచి 23,000 కాంట్రాక్ట్‌లు తగ్గాయి. షార్ట్ పొజిషన్‌లు 15,000 కాంట్రాక్ట్‌లు పెరిగాయి.
5) సాంకేతిక అంశాలు
గత ఇరవై ట్రేడింగ్ సెషన్‌ల నుంచి 17,777 - 18,250 జోన్ మధ్య నిఫ్టీ చక్కర్లు కొడుతోంది. బుధవారం ట్రేడ్‌లో ఈ ఇండెక్స్ 50-డేస్ EMA కంటే దిగువకు పడిపోయింది, ఇది బేరిష్ ట్రెండ్‌ను నిర్ధరించింది. RSI కూడా బేరిష్ క్రాస్ ఓవర్ మోడ్‌లో ఉంది.
6) బడ్జెట్ ముందు గందరగోళం
వచ్చే వారం జరగనున్న పెద్ద దేశీయ ఈవెంట్ అయిన యూనియన్ బడ్జెట్ 2023 కూడా దలాల్ స్ట్రీట్‌లోని భయాందోళనలో కొంత భాగానికి కారణంగా మారింది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పిస్తుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల రేటును పెంచడం లేదా కార్పొరేట్ పన్నుల్లో పెంపుదల వంటి ప్రతిపాదనలు బడ్జెట్‌లో ఉంటే, దలాల్ స్ట్రీట్‌లో బేరిష్ సెంటిమెంట్లు పెరగవచ్చు.
7) బాండ్ ఈల్డ్స్ పెరుగుదల
భారత ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ శుక్రవారం పెరిగాయి. బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఈల్డ్ దాదాపు మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. బెంచ్‌మార్క్ అయిన పదేళ్ల బాండ్ ఈల్డ్ 7.3756% వద్ద ఉంది.
8) ముడి చమురు ధరలు
చైనా నుంచి డిమాండ్ రికవరీ ఆశల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కొన్ని రోజుల నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. బ్యారెల్ క్రూడ్ రేటు $88 వద్దకు చేరింది. ఇది, మన లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.