LIC Q1 Results: క్యూ1 రిపోర్ట్ కార్డ్ కేక, జూన్ త్రైమాసికంలో ఎల్‌ఐసీకి ₹9,544 కోట్ల లాభం
నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 9,544 కోట్లకు చేరుకుంది.
LIC Q1 Results: ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), జూన్ క్వార్టర్ రిజల్ట్స్‌లో మోత మోగించింది. ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ స్వతంత్ర నికర లాభం (standalone net profit) అనేక రెట్లు పెరిగి రూ. 9,544 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే మూడు నెలల్లో ఈ కంపెనీ మిగుల్చుకున్న లాభం రూ. 683 కోట్లు.
గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత Q1 FY24 ఫలితాలను LIC ప్రకటించింది.
ఎల్‌ఐసీ జూన్ క్వార్టర్ ఫలితాల ఫుల్ రిపోర్ట్ కార్డ్:
- జూన్ క్వార్టర్‌లో పన్నుకు ముందు లాభంగా (PBT) రూ. 9,634 కోట్లను ఎల్‌ఐసీ రిపోర్ట్ చేసింది, ఇది కూడా గత ఏడాది ఇదే కాలంలోని రూ. 799 కోట్ల నుంచి చాలా రెట్లు పెరిగింది.
- అదే సమయంలో, నికర ప్రీమియం ఆదాయం రిపోర్టింగ్ క్వార్టర్‌లో రూ. 98,363 కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 98,351 కోట్లుగా ఉంది.
- సీక్వెన్షియల్ (QoQ) ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం, నికర ప్రీమియం ఆదాయం రెండూ తగ్గాయి. మార్చి త్రైమాసికంలో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 13,428 కోట్ల నెట్ ప్రాఫిట్ సాధించింది, అది ఇప్పుడు 29% తగ్గింది. నెట్ ప్రీమియం ఇన్‌కమ్ కూడా 25% పడిపోయింది.
- సమీక్ష కాలంలో, పెట్టుబడుల ద్వారా రూ. 90,309 కోట్ల ఆదాయాన్ని ఎల్‌ఐసీ సంపాదించింది, YoYలో ఇది 30% వృద్ధి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ. 69,571 కోట్లుగా ఉంది.
- జూన్ క్వార్టర్‌లో కంపెనీకి వచ్చిన ఇతర ఆదాయాలు రూ. 75 కోట్లుగా లెక్క తేలాయి. ఏడాది క్రితం వచ్చిన రూ. 160 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 53% తగ్గాయి.
- మొదటి త్రైమాసికంలో, ఫస్ట్ ఇయర్ ప్రీమియం 8% క్షీణించి రూ. 6,811 కోట్లకు పరిమితమైంది, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 7,429 కోట్లుగా ఉంది.
- బీమా సంస్థ సాల్వెన్సీ రేషియో ఏప్రిల్-జూన్ కాలంలో 1.89గా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంలో 1.87గా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 1.88గా ఉంది.
- Q1లో, 13వ నెల పెర్సిస్టెన్సీ రేషియో (persistency ratio) మార్చి క్వార్టర్‌లోని 70.16% నుంచి 75.10%కి చేరింది. 2022 జూన్ త్రైమాసికంలో ఇది 75.75%గా ఉంది.
గురువారం, Q1 ఫలితాలకు ముందు, LIC షేర్లు 0.36% నష్టంతో రూ. 641.60 వద్ద ముగిశాయి.
మరో ఆసక్తికర కథనం: టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఐపీవో - ఎక్స్‌పర్ట్‌లు బిడ్ వేయమంటున్నారా, వద్దంటున్నారా?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial