Economic Growth: ఈ ఆర్థిక సంవత్సరంలో 7%, వచ్చే ఏడాది 6% వృద్ధి అంచనా
2023-24 నాటికి ఇది 6 శాతానికి తగ్గుతుందని లెక్కలు వేసింది.
S&P Global Rating On India’s Economic Growth: క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P గ్లోబల్ రేటింగ్స్, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి (2023-24 లేదా FY24) భారతదేశ ఆర్థిక వృద్ధిని 6 శాతంగా అంచనా వేసింది. గతంలో కూడా ఇదే అంచనాను రేటింగ్ ఏజెన్సీ వెలువరించింది, దానిలో ఎలాంటి మార్పు చేయకుండా ప్రస్తుత అప్‌డేట్‌లోనూ కొనసాగించింది. తర్వాతి ఆర్థిక సంవత్సరాలైన 2024-25 & 2025-26లో ఆర్థిక వృద్ధి 6.9 శాతానికి పెంచే అవకాశాలు ఉండవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఆశాభావం వ్యక్తం చేసింది.
ద్రవ్యోల్బణంపై S&P అంచనా
ఆసియా-పసిఫిక్ త్రైమాసిక ఆర్థిక సమాచారం అప్‌డేషన్‌లో భాగంగా.. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 6.8 శాతం నుంచి 2023-24లో 5 శాతానికి తగ్గుతుందని S&P పేర్కొంది. అయితే వాతావరణ సంబంధిత ప్రతికూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. ద్రవ్యోల్బణ వృద్ధికి అడ్డుకట్ట వేసేందుకు, ఇప్పటికే అధిక స్థాయిలో ఉన్న కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరింత పెంచే అవకాశం ఉందని రేటింగ్స్ ఏజెన్సీ తెలిపింది.
భారత ఆర్థిక వృద్ధి ఇలా..
భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (gross domestic production - GDP) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) 7 శాతంగా నమోదయ్యే మోదయ్యే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. అయితే, 2023-24 నాటికి ఇది 6 శాతానికి తగ్గుతుందని లెక్కలు వేసింది.
2024-2026 సంవత్సరాల కాలంలో భారతదేశ వృద్ధి రేటు సగటున 7 శాతంగా ఉంటుందని S&P నివేదిక పేర్కొంది. విడివిడిగా చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరం & 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతం చొప్పున నమోదు అవుతుందని అంచనా వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 7.1 శాతానికి పెరుగుతుందని తెలిపింది.
"భారతదేశ ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయికంగా దేశీయ డిమాండ్ ద్వారా నడుస్తుంది. కొంత ఆలస్యమైనా, గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా స్పందిస్తోంది. కమొడిటీల ఎగుమతులు పెరగడం దీనికి ఒక కారణం. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, వార్షిక ప్రాతిపదికన, GDP వృద్ధి 4.4 శాతానికి నెమ్మదించింది" -S&P గ్లోబల్ రేటింగ్స్
చైనా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంది
ఆసియా-పసిఫిక్ ప్రాంతం విషయంలో "జాగ్రత్తతో కూడిన సానుకూల దృక్పథం"ను (cautiously optimistic outlook for Asia-Pacific) S&P రేటింగ్స్ ప్రకటించింది. చైనా ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం తిరిగి పుంజుకుంటుందని పేర్కొంది.
చైనాలో రికవరీ దాదాపుగా ఆర్గానిక్ మార్గంలో ఉంటుందని విశ్వసిస్తున్నట్లు రేటింగ్స్ ఏజెన్సీ వివరించింది. వినియోగం, సేవల రంగాలు ఆ దేశ ఆర్థిక వృద్ధికి నాయకత్వం వహిస్తాయని వెల్లడించింది. నవంబర్ నాటి అంచనా 4.8%ను మించి ఈ సంవత్సరం ఆ దేశం GDP వృద్ధి 5.5%కు చేరుతుందని అంచనా. మార్చి నెలలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రకటించిన 5% లక్ష్యాన్ని కూడా ఇది మించిపోయిందని అని S&P గ్లోబల్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ లూయిస్ కుయిజ్ చెప్పారు.