Retail investors: నెలనెలా తగ్గుతున్న ట్రేడర్లు - బోర్ కొట్టిందా, భయపడుతున్నారా?
మొత్తం మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 66 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది.
Retail investors in Equity: పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల ఇండియన్ ఈక్విటీ మార్కెట్లలో విపరీతమైన ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. నమ్మకం పెట్టుకున్న షేర్లు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య, మార్కెట్‌లో వ్యక్తిగత పెట్టుబడిదార్ల పాత్ర బాగా తగ్గుతోంది. మొత్తం మార్కెట్ క్రయవిక్రయాల్లో ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల వాటా 2023 జనవరిలో 34 నెలల కనిష్టానికి పడిపోయింది. రిటైల్ ఇన్వెస్టర్లకు అత్యంత ఇష్టమైన మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒత్తిడికి గురి కావడంతో, NSEలో యాక్టివ్ క్లయింట్ల సంఖ్య వరుసగా ఎనిమిదో నెల (జనవరి) కూడా క్షీణించింది.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (non-institutional investors) రోజువారీ సగటు వాటా, ముఖ్యంగా రిటైల్ & హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్ల (HNIs) వాటా జనవరి 2023లో ₹22,829 కోట్లకు చేరుకుంది. మార్చి 2020 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఫిబ్రవరి 2021లో నమోదైన గరిష్టం ₹58,409 కోట్ల కంటే ఇది గణనీయంగా, 61% తక్కువ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మార్కెట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 66 శాతం నుంచి 44 శాతానికి తగ్గింది.
తగ్గిన యాక్టివ్ డీమ్యాట్ ఖాతాలు
2023 జనవరిలో, NSEలో, క్రియాశీల డీమ్యాట్ ఖాతాల సంఖ్య 3.4 కోట్లుగా ఉంది, అంతకు ముందు నెలతో పోలిస్తే ఇది 3% తగ్గింది. ఇది వరుసగా ఎనిమిదో నెలవారీ క్షీణత. NSEలో యాక్టివ్ ఖాతాల సంఖ్య జూన్ 2022లో 3.8 కోట్లుగా ఉంది, ఆ నెల నుంచి తగ్గుదల ప్రారంభమైంది.
గత కొన్ని నెలలుగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అస్థిరత, క్షీణత కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెద్దగా డబ్బు సంపాదించలేకపోయారు. గత ఏడాది కాలంలో (last one year) నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 10% క్షీణించగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 5% లాభపడింది. ఇదే కాలంలో నిఫ్టీ50 3.7% పెరిగింది.
బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు బాగానే కనిపిస్తుండడంతో... చాలా మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో డీప్ లాసెస్ వెలుగులోకి రాలేదు. చాలా కౌంటర్లు సగటున 20-40% వరకు నష్టపోయాయి.
పాత్ర తగ్గడానికి పలు కారణాలు
“IPO స్టాక్స్ నిరుత్సాహపరచడం; మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీ దిద్దుబాట్లు; పెరుగుతున్న వడ్డీ రేట్లు; TINA (There Is No Alternative) నుంచి TARA (There Are Reasonable Alternatives) కి మారడం వంటివి రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని తగ్గించిన కారణాల్లో కొన్ని. ఫ్రీ ETF క్రెడిట్‌ను నిషేధిస్తూ సెబీ సర్క్యులర్ ఇవ్వడం కూడా యాక్టివ్ క్లయింట్ల నంబర్‌లో పతనానికి దారితీసింది.” అని HDFC సెక్యూరిటీస్ MD ధీరజ్ రెల్లి చెప్పారు.
మార్జిన్ రిక్వైర్‌మెంట్స్‌పై సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్తగా కఠిన ఆంక్షలు విధించడం కూడా ఇండివిడ్యువల్ ట్రేడర్లు క్యాష్ మార్కెట్ నుంచి డెరివేటివ్ విభాగానికి మారడానికి కారణంగా మారిందని కొన్ని బ్రోకింగ్ కంపెనీలు చెబుతున్నాయి.
గత సంవత్సర కాలంలో, NSE ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (F&O) విభాగంలో సగటు రోజువారీ టర్నోవర్ 139% పెరిగి 215 లక్షల కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.