RIL Q1 Results: రిలయన్స్ ఫలితాలు నేడే విడుదల - 36 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ వినడానికి చెవులను చేటలు చేసుకుని దలాల్ స్ట్రీట్ ఎదురు చూస్తోంది.
RIL Q1 Results: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతి పెద్ద కంపెనీ, దాదాపు 36 లక్షల మంది షేర్‌హోల్డర్లున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను ఇవాళ ప్రకటిస్తుంది. ఇవాళ, మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. ఆయిల్-టు-కెమికల్స్ వ్యాపారం పెర్ఫార్మెన్స్‌లో మందగమనం కారణంగా, కంపెనీ లాభంలో రెండంకెల పతనం ఉంటుందని అంచనా.
ఇవాళ, RIL ఆదాయాలను మించిన విషయం మరొకటి ఉంది. అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ వినడానికి చెవులను చేటలు చేసుకుని దలాల్ స్ట్రీట్ ఎదురు చూస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జర్ కారణంగా, జియో ఫైనాన్షియల్ షేర్ ప్రైస్ కనిపెట్టడానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు నిన్న (గురువారం, 20 జులై 2023) RIL షేర్లలో స్పెషల్ ప్రి-ఓపెన్ సెషన్ నిర్వహించాయి. నిఫ్టీ50, సెన్సెక్స్, మరికొన్ని కీలక ఇండెక్సుల్లోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను తాత్కాలికంగా యాడ్ చేశాయి. ఈ సెషన్‌లో జియో ఫైనాన్షియల్ షేర్లు మార్కెట్‌ను ఆశ్చర్యపరిచాయి. దీని షేర్ ప్రైస్ రూ. 190 వరకు ఉంటుందని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తే, అంతకుమించి రాణించి, ఒక్కో షేరు రూ. 261.85 వద్దకు చేరింది.
ఇవాళ, Q1 రిజల్ట్స్ ప్రకటనతో పాటే Jio ఫైనాన్షియల్ లిస్టింగ్ తేదీని RIL ప్రకటిస్తుందని షేర్‌హోల్డర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.
రిలయన్స్ Q1 రిజల్ట్స్ ఇలా ఉండొచ్చు
10 బ్రోకరేజీలు ఇచ్చిన అంచనాల సగటు ప్రకారం, జూన్ త్రైమాసికంలో RIL ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 10% తగ్గి రూ. 16,170 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. ఏకీకృత ఆదాయం 2% YoY తగ్గి రూ. 2.15 లక్షల కోట్లుగా నమోదు కావచ్చు.
QoQలో, బాటమ్‌లైన్ పతనం 16% పైగా ఉంటుందని అంచనా. అమ్మకాలు కేవలం 1% పెరగొచ్చు.
ఆయిల్-టు-కెమికల్స్ విభాగం బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, రిటైల్ & టెలికాం వ్యాపారాలు బలాన్ని ప్రదర్శించొచ్చు.
నువామా ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ లెక్క ప్రకారం, రిటైల్ సెగ్మెంట్ నిర్వహణ లాభం 24% YoY పెరుగుతుంది, హయ్యర్ ఫుట్‌ఫాల్స్‌లో బలంగా ఉంటుంది. Jio నిర్వహణ లాభం సంవత్సరానికి 11% పెరిగే అవకాశం ఉంది. అయితే సబ్‌స్క్రైబర్ బేస్ QoQలో ఫ్లాట్‌గా ఉంటుంది. ARPU YoYలో ఫ్లాట్‌గా, QoQలో రూ. 171 వద్ద ఉండే అవకాశం ఉంది.
హిస్టారికల్ స్టాక్ పెర్ఫార్మెన్స్
చరిత్రను తిరగేస్తే, ఫలితాల ప్రకటన తర్వాత RIL షేర్లు పాజిటివ్‌గా స్పందించలేదు. గత 12 త్రైమాసికాల్లో, 10 సందర్భాల్లో ఇన్వెస్టర్లకు నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎప్పటిలాగే, త్రైమాసిక ఫలితాలు ఈ స్టాక్‌కు నాన్-ఈవెంట్ అని ఎనలిస్ట్‌లు తేల్చారు. అంటే, స్టాక్ పెర్ఫార్మెన్స్‌పై ఈ ఫలితాల ప్రభావం ఉండదని చెబుతున్నారు. అయితే, Jio ఫైనాన్షియల్ గురించి ఏవైనా పాజిటివ్ ప్రకటన ఉంటే స్టాక్ బలంగా రియాక్ట్ అవుతుంది. తద్వారా, కన్సాలిడేషన్ జోన్ నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తుంది.
RIL షేర్లు గత ఏడాది కాలంగా ఒక టైట్ రేంజ్‌లో ట్రేడ్ అవుతున్నాయి, మేజర్ రెసిస్టెన్స్ జోన్ అయిన రూ. 2,750-2,800 స్థాయిని బద్ధలు కొట్టడానికి చాలా కష్టపడుతోంది. ప్రస్తుత స్థాయిని 'బయ్-ఆన్-డిప్'గా చూడొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ చెబుతోంది. ఒకవేళ రిలయన్స్ షేర్లు రూ. 2,750-2,800 స్థాయిని బద్ధలు కొట్టగలిగితే, రూ. 3,100 జోన్‌కు తలుపులు తెరుచుకుంటాయని తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: మస్క్ మామ సీటుకు ఎసరు - పదవి పొగొట్టుకునే ప్రమాదం!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial