Elon Musk Net Worth: మస్క్ మామ సీటుకు ఎసరు - పదవి పొగొట్టుకునే ప్రమాదం!
గురువారం ఒక్క రోజే మస్క్ సంపద అతి భారీగా పతనమైంది.
Elon Musk Net Worth: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు పదవి గండం పొంచి ఉంది. తన నంబర్ వన్ కుర్చీని మస్క్ మామ కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్. గురువారం ఒక్క రోజే మస్క్ సంపద అతి భారీగా పతనమైంది. అదే సమయంలో, రిచ్ పీపుల్ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ డబ్బు పెరిగింది. దీంతో, వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్‌లోని నంబర్ 1 - నంబర్ 2 ఆస్తుల మధ్య గ్యాప్ చాలా వేగంగా తగ్గింది.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ ప్రకారం, ఎలాన్ మస్క్ సంపద గురువారం (20 జులై 2023) నాడు 18.4 బిలియన్ డాలర్లు లేదా 7.16 శాతం మేర ఆవిరైంది. ఇది అతి భారీ పతనం. ఈ క్షీఇతతో, టెస్లా CEO మొత్తం ఆస్తుల విలువ 238.4 బిలియన్లకు తగ్గింది. అదే సమయంలో, ప్రపంచంలో రెండో అత్యంత సంపన్నుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద 952 మిలియన్లు పెరిగింది, అతని మొత్తం సంపద విలువ 235.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే, నంబర్ 1 ఎలాన్ మస్క్ - నంబర్ 2 బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తుల మధ్య తేడా కేవలం 3.2 బిలియన్ డాలర్లు మాత్రమే. టెస్లా షేర్లు ఇంకొంచం తగ్గినా, బెర్నార్డ్ ఆల్నాల్ట్ సంపద ఇంకొంత పెరిగినా... ప్రపంచ నంబర్ 1 పదవిని మస్క్ మామ కోల్పోతారు.
ఎలాన్ మస్క్ ఆస్తి ఎందుకు తగ్గింది?
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తలతో, టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మస్క్ మామ సంపదలో ఎక్కువ భాగం టెస్లా షేర్ల నుంచే కౌంట్ అవుతుంది. అందువల్లే, టెస్లా షేర్లు పడిపోగానే మస్క్ సంపదన కూడా తగ్గింది.
అయితే, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ నికర విలువ (Net Worth) ఇప్పటికీ ఆర్నాల్ట్ కంటే చాలా ఎక్కువగా ఉంది.
ఫ్రెంచ్ ఫ్యాషన్ కంపెనీ LVMH చైర్మన్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్‌కు ముందు చాలా కాలం పాటు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుర్చీపై కూర్చున్నారు. గత జూన్‌లో ఎలాన్ మస్క్ సంపద పెరిగి, ఆర్నాల్ట్ సంపద క్షీణించింది. దీంతో, ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, ఎలాన్ మస్క్ తన సంపదకు 118 బిలియన్ డాలర్లు యాడ్ చేశారు. అదే సమయంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్ కూడా 40.7 బిలియన్ డాలర్లు సంపాదించారు.
ఒక్క ఎలాన్ మస్క్ మాత్రమే కాదు, గురువారం మరికొందరు బిలియనీర్ల ఆస్తుల విలువలోనూ కోత పడింది. జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, స్టీవ్ బాల్మెర్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ నెట్‌వర్త్ కూడా తగ్గింది.
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఆస్తుల విలువ
ఆసియాలో అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీ సంపద గురువారం నాడు 7.6 బిలియన్ డాలర్లు క్షీణించింది, అతని మొత్తం ఆస్తి విలువ 93.6 బిలియన్లకు తగ్గింది. ప్రస్తుతం, ప్రపంచంలోని 13వ రిచెస్ట్ పర్సన్ వ్యక్తి ముకేష్ అంబానీ. అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ, గ్లోబల్ బిలియనీర్ల లిస్ట్‌లో 24వ ర్యాంకులో ఉన్నారు. ఆయన నెట్‌వర్త్ 51.9 బిలియన్ డాలర్లు.
మరో ఆసక్తికర కథనం: థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల నుంచి కూడా ITR ఫైల్ చేయొచ్చు - 6 పాపులర్ సైట్లు, వాటి ఫీజ్‌లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial