Reliance: రిలయన్స్ షేర్లతో భారీ లాభావకాశం, సెప్టెంబర్ నాటికి జియో ఫైనాన్షియల్ లిస్టింగ్!
ఒక్కో షేరు రూ. 779 లేదా 33 శాతం వరకు రాబడిని ఇవ్వగలదన్నది జెఫరీస్ ఇచ్చిన ప్రైస్ టార్గెట్ అర్ధం.
Reliance Industries Share Price: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరలో అతి భారీ లాభాలకు అవకాశం కనిపిస్తోందని విదేశీ బ్రోకింగ్ సంస్థ జెఫరీస్ (Jefferies) వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలో ఈ కంపెనీ షేర్లను కొని హోల్డ్ చేయగలిగితే, మరో 33% రాబడిని ఈ స్టాక్ ఇచ్చే అవకాశం ఉందని జెఫరీస్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. దీనికి అనుగుణంగా, రిలయన్స్ షేర్ ప్రైస్ టార్గెట్‌ను రూ. 3,060 నుంచి రూ. 3,100 కి ఈ బ్రోకింగ్ హౌస్ అప్‌గ్రేడ్ చేసింది.
సోమవారం (03 ఏప్రిల్ 2023) నాడు, BSEలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర రూ. 2,331.75 వద్ద ముగిసింది. అంటే, ఈ స్థాయిల నుంచి ఒక్కో షేరు రూ. 779 లేదా 33 శాతం వరకు రాబడిని ఇవ్వగలదన్నది జెఫరీస్ ఇచ్చిన ప్రైస్ టార్గెట్ అర్ధం.
ఇవాళ, (బుధవారం, 04 ఏప్రిల్ 2023) రూ. 2,341.75 వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఓపెన్ అయింది.
48% రాబడికి ఛాన్స్
జెఫరీస్ నివేదిక ప్రకారం.. బేస్ సినారియోలో ఈ స్టాక్ రూ. 3100 వరకు, అప్‌సైడ్ సినారియోలో రూ. 3450 వరకు వెళ్లవచ్చు. అంటే, ప్రస్తుత స్థాయి నుంచి 48 శాతం రాబడిని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. డౌన్‌సైడ్ రిస్క్‌ను రూ. 2250 గా జెపరీస్ సూచించింది. స్టాక్ పతనమైతే కేవలం 3 శాతం మాత్రమే తగ్గుతుందని వెల్లడించింది.
రూ.132-224 మధ్య జియో ఫైనాన్షియల్ షేర్ ధర
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ చేయబోతున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పైనా (Jio Financial Services Ltd) తన అంచనాలను జెఫరీస్ వెల్లడించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక్కో షేరు రూ. 132 నుంచి రూ. 224 మధ్య ఉండొచ్చని జెఫరీస్ అంచనా వేసింది.
ఈ ఏడాది మే 2వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదార్లు, రుణదాతల సమావేశం జరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విభజనకు ఆ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ డీమెర్జర్ కోసమే వాటాదార్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. 2023 సెప్టెంబర్ నెల నాటికి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావచ్చని జెఫరీస్‌లోని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమెర్జర్ తర్వాత.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లు అందరికీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 1:1 నిష్పత్తిలో లభిస్తాయి. అంటే.. రిలయన్స్‌లో హోల్డ్ చేస్తున్న ప్రతి ఒక షేరుకు, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఒక షేర్ క్రెడిట్ అవుతుంది. జెఫరీస్ లెక్క ప్రకారం... జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నికర విలువ రూ. 28,000 కోట్లుగా ఉండవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఈ కంపెనీకి 6.1 శాతం వాటా ఉంది, దీని విలువ రూ. 96,000 కోట్లు.
ఇతర బ్రోకింగ్ హౌస్‌లు కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశంలో ఐదో అతి పెద్ద ఆర్థిక సేవల సంస్థగా అవతరించవచ్చని మాక్వేరీ రీసెర్చ్ (Macquarie Research) తన నివేదికలో పేర్కొంది. డిజిటల్, రిటైల్ రంగంలోని రిలయన్స్ బలం నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ విపరీతమైన ప్రయోజనం పొందుతుందని జేపీ మోర్గాన్ (JP Morgan) పేర్కొంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.