Torn Currency Notes: ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే టెన్షన్ పడొద్దు, వాటిని ఈజీగా మార్చుకోవచ్చు
Torn Currency Notes From ATM: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, ముక్కలుగా ఉన్న మరియు/లేదా ముఖ్యమైన భాగాలు లేని నోట్లను కూడా మార్చుకోవచ్చు. టెన్షన్ పడకుండా ఈ విధంగా చేస్తే సరిపోతుంది.
How You Can Exchange Torn Currency Notes: ఒక్కోసారి, ఏటీఎంల నుంచి చిరిగిన లేదా బాగా నలిగిన లేదా పాడైన కరెన్సీ నోట్లు వస్తాయి, ప్రజలను అయోమయంలో పడేస్తుంటాయి. దుకాణదారుడికి చిరిగిన/ పాడైన నోటును తిరిగి ఇచ్చి, మరో మంచి నోటును తీసుకున్నట్లు ఏటీఎం నుంచి తీసుకోలేం. పోనీ, చిరిగిన నోట్లను మార్కెట్‌లో మారుద్దామా అంటే ఎవరూ తీసుకోరు. ఈ ఐడియా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి, ఏటీఎం నుంచి వచ్చిన చిరిగిన/పాడైన నోట్లు కస్టమర్‌ను ఆందోళనకు గురి చేస్తాయి. ఏటీఎంలో మీకు ఇలాంటి అనుభవం ఎదురైతే, మీరు మాత్రం టెన్షన్ పడొద్దు. పాడైన నోట్లను కొత్త నోట్లతో సులభంగా మార్చుకునే ఉపాయం ఉంది.
పాడైన నోట్ల మార్పిడి కోసం మార్గదర్శకాలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గైడ్‌లైన్స్ ప్రకారం... ముక్కలుగా చిరిగిన లేదా ముఖ్యమైన భాగాలు లేని నోట్లను కూడా మార్చుకోవచ్చు. కరెన్సీ నోటులో ముఖ్యమైన భాగాలు ఇష్యూయింగ్ అథారిటీ పేరు, హామీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం చిహ్నం, మహాత్మా గాంధీ చిత్రం, వాటర్ మార్క్. మీ దగ్గర ఉన్న నోటులో ఇలాంటి కీలక విషయాలు మాయమైనా ఆ నోటును సులభంగా ఎక్సేంజ్ చేయొచ్చు.
ఎలాంటి ఫారం పూర్తి నింపాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వ రంగ బ్యాంక్, ప్రైవేట్ రంగ బ్యాంక్, కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ లేదా RBI ఇష్యూ ఆఫీస్ కౌంటర్‌లో ఆ నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఈ నోట్ల రీఫండ్ విలువను ఆర్‌బీఐ నోట్ రీఫండ్ నిబంధనల (RBI Note Refund Rules) ప్రకారం చెల్లిస్తారు.
సాయిల్డ్ నోట్స్ అంటే ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, మురికిగా మారిన లేదా కొంతభాగం కోల్పోయిన నోట్లను సాయిల్డ్ నోట్స్ అంటారు. నోటు రెండు వైపులా నంబర్ ఉండి రెండు ముక్కలుగా మారినప్పటికీ సాయిల్డ్ నోట్లుగా పరిగణిస్తారు. అయితే, మర్చుకోవాలనుకున్న నోట్లు రూ.10 లేదా అంతకంటే ఎక్కువ విలువతో ఉండాలి.
ఇక్కడో విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. మార్పిడి చేసుకునే నోట్లలో నంబర్ కట్ కాకూడదు. నంబర్ స్పష్టంగా తెలిసేలా నోటు ఉండాలి. అప్పుడే ఏ బ్యాంక్‌లోనైనా వాటి మార్పిడి సాధ్యమవుతుంది.
పాడైన నోట్లను బ్యాంకులో ఎలా మార్చాలి?
మీకు ఏటీఎం నుంచి చిరిగిన లేదా పాడైన కరెన్సీ నోటు/నోట్లు వస్తే, ఆ ఏటీఎంకు సంబంధించిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి.
అక్కడ, ఒక పేపర్ మీద కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది.
చిరిగిన/పాడైన నోటు లేదా నోట్లను ఏ ఏటీఎం నుంచి విత్‌డ్రా చేశారు, తేదీ, సమయం, ప్రాంతం వంటి సమాచారాన్ని రాసివ్వాలి.
ఆ తర్వాత, ఆ వివరాలతో పాటు ATM నుంచి మీ లావాదేవీకి సంబంధించిన స్లిప్‌ను కూడా జత చేయాలి.
స్లిప్ లేకపోతే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన లావాదేవీ వివరాలను తెలియజేయాలి.
మీ నోట్లను బ్యాంక్ సిబ్బంది తీసుకుని, నిబంధనల ప్రకారం మీకు మంచి నోట్లు తిరిగి ఇస్తారు.
ఏటీఎంతో సంబంధం లేకుండా, మీ దగ్గర ఉన్న నోట్లు పొరపాటున చిరిగినా/పాడైనా కూడా వాటిని ఏ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లయినా మార్చుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మీ గ్యాస్ సిలిండర్ పైపును మార్చి ఎన్నేళ్లయింది?, ఎక్స్‌పైరీ డేట్‌ను ఇలా చెక్ చేయండి