RBI Action: యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌పై కోట్ల రూపాయల జరిమానా - ఆర్‌బీఐతో అట్లుంటది
RBI Action On Banks: సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచనందుకు బ్యాంకులు జరిమానా వసూలు చేస్తాయి. అలా చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది.
RBI Action On YES Bank And ICICI Bank: భారతీయ కేంద్ర బ్యాంక్ అయిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI), రెండు పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులు యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌పై కొరడా ఝుళిపించింది. నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో గట్టి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌కు కలిపి ఒక కోటి 90 లక్షల రూపాయల (రూ.1.90 కోట్లు) జరిమానా విధించింది. ఈ రెండు బ్యాంకులు చాలా మార్గదర్శకాలను పాటించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది.
యెస్ బ్యాంక్‌కు ఫైన్ వేయడానికి కారణం ఇదీ..
రిజర్వ్ బ్యాంక్ చెప్పిన ప్రకారం... కస్టమర్ సేవలు, అంతర్గత & కార్యాలయ ఖాతాలకు సంబంధించిన మార్గదర్శకాలను యెస్ బ్యాంక్ ఉల్లంఘించింది. పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ (Minimum Balance) లేదన్న కారణంగా ఈ బ్యాంకు చాలా ఖాతాల నుంచి ఛార్జీలు వసూలు చేసింది. చాలాసార్లు ఇలాంటి వసూళ్లకు పాల్పడింది. వాస్తవానికి, సేవింగ్స్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచనందుకు బ్యాంకులు జరిమానా వసూలు చేస్తాయి. అలా చేయకూడదని రిజర్వ్ బ్యాంక్ గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ ఆర్డర్ ఉన్నప్పటికీ, యెస్ బ్యాంక్ రుసుములు వసూలు చేసింది. 2022 సంవత్సరంలో యెస్ బ్యాంక్ ఇలాంటి పనులు చాలాసార్లు చేసినట్లు ఆర్‌బీఐ తన అంచనాలో కనిపెట్టింది. అంతేకాదు, అంతర్గత & కార్యాలయ ఖాతాల నుంచి అక్రమ కార్యకలాపాలు జరిగాయని తేల్చింది. పార్కింగ్ ఫండ్స్, లావాదేవీలకు సంబంధించి అనధికారిక ప్రయోజనాల కోసం, ఖాతాదార్ల పేరిట కొన్ని అంతర్గత ఖాతాలను తెరిచి & నిర్వహిస్తున్నట్లు కూడా ఆర్‌బీఐ తనిఖీలో వెల్లడైంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు కేంద్ర బ్యాంక్ యెస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది.
ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఫైన్ వేయడానికి కారణం ఇదీ..
లోన్లు & అడ్వాన్సులకు (ఒక సంవత్సరం లోపు కాల పరిమితితో ఇచ్చే రుణాలు) సంబంధించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ICICI బ్యాంక్ దోషిగా తేలింది. ఈ తప్పునకు ప్రాయశ్చిత్తంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కోటి రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌బీఐ చెప్పిన ప్రకారం, పూర్తి స్థాయి విచారణ చేయకుండానే ఈ బ్యాంక్ చాలా రుణాలను ఆమోదించింది. దీంతో బ్యాంక్ ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. బ్యాంక్ రుణాల మంజూరు ప్రక్రియలో లోపాలన్నీ ఆర్‌బీఐ విచారణలో బయటపడ్డాయి. చాలా ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలు, రుణ చెల్లింపు సామర్థ్యంపై వివరణాత్మక విశ్లేషణ లేకుండానే ఐసీఐసీఐ బ్యాంక్ లోన్లు మంజూరు చేసింది.
"మార్గదర్శకాలు పాటించడంలో వైఫల్యాల ఆధారంగా ఈ చర్య తీసుకున్నాం. ఖాతాదార్లతో ఐసీఐసీఐ బ్యాంక్ కుదుర్చుకున్న లావాదేవీలు లేదా ఒప్పందాల్లో జోక్యం చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ భావించడం లేదు" అని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగ & ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలో పని చేస్తాయి. నిబంధనలను పాటించని బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేస్తుంది, కొన్నిసార్లు జరిమానా విధిస్తుంది.
మరో ఆసక్తికర కథనం: నిర్మాణంలో ఉన్న ఇంటిపై అప్పును సెక్షన్ 80C, 24B కింద క్లెయిమ్ చేయొచ్చా?