RBI Digital Rupee: డిజిటల్ రూపాయి వెనక 'కొరడా' వ్యూహం! నల్ల ధనం, పన్ను ఎగవేతదారులకు చుక్కలే!!
'డిజిటల్ రూపాయి' వెనక భారీ వ్యూహమే ఉన్నట్టుంది. అక్రమ నగదు బదిలీ, నల్లధనం నియంత్రణ, పన్ను ఎగవేత దారులను గుర్తించేందుకు అస్త్రంగా వాడుకోబోతున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా ప్రతిపాదించిన 'డిజిటల్ రూపాయి' వెనక భారీ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ నగదు బదిలీ, నల్లధనం నియంత్రణకే దీనిని తీసుకొస్తున్నారని సమాచారం. అంతేకాకుండా పన్ను ఎగవేత దారులను గుర్తించేందుకు దీనినో అస్త్రంగా వాడుకోబోతున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
డిజిటల్ రూపాయితో చేసే ప్రతి లావాదేవీ వివరాలు భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద ఉంటాయని ఆ అధికారి ఏఎన్‌ఐకి తెలిపారు. 'ఒక దుకాణాదారు వద్ద నుంచి మీరేదైనా కొనుక్కున్నారని అనుకుందాం. మీరప్పుడు డిజిటల్ డబ్బును చెల్లించారు. ఆ డిజిటల్ డబ్బును ఆ దుకాణాదారు తన వెండర్‌కు చెల్లిస్తాడు. అంటే ఈ డిజిటల్ రూపాయితో చేసిన ప్రతి లావాదేవీ వివరాలు ఆర్‌బీఐ వద్ద ఉంటాయి' అని ఆ అధికారి వెల్లడించారు.
దాదాపుగా నల్లధనం వ్యవహారాలన్నీ నగదు రూపంలోనే జరుగుతుంటాయని ఆ అధికారి నొక్కి చెప్పారు. వాటిపై పన్నులు పడటం లేదని వెల్లడించారు. కానీ ఆర్‌బీఐ వద్ద ప్రతి లావాదేవీ వివరాలు ఉన్నప్పుడు వ్యక్తులు పన్ను ఎగవేతకు పాల్పడటం కష్టమని స్పష్టం చేశారు. కాగా కేంద్ర బ్యాంకు విడుదల చేసే డిజిటల్ కరెన్సీ వల్ల డిజిటల్ ఎకానమీ జోరందుకుంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. పైగా డిజిటల్ కరెన్సీ వల్ల మరింత సమర్థత, తక్కువ ఖర్చుతోనే కరెన్సీ వ్యవస్థ నిర్వహణ చేపట్టొచ్చని తెలిపారు.
నల్లధనాన్ని నియంత్రించేందుకు, పన్ను ఎగవేతలను అడ్డుకొనేందుకు కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఒక ప్రావిజన్ ప్రకటించారు. 'ప్రస్తుతం సెటాఫ్ విషయంలో గందరగోళం నెలకొంది. సోదాలు చేస్తున్నప్పుడు దొరికిన అప్రకటిత ఆదాయం మీద నష్టాలు వచ్చినట్టు సెటాఫ్ చేస్తున్నారు. అమ్మకాలు తగ్గించి చూపించిన ఆదాయం విషయంలోనూ ఇలాగే సెటాఫ్ చేసి ఎగవేతకు పాల్పడుతున్నారు. అందుకే సోదాల్లో దొరికిన ఆదాయంపై నష్టాల రూపంలో సెటాఫ్ ఇకపై ఉండదు' అని మంత్రి అన్నారు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రక్రియ గతేడాది నుంచే వేగవంతమైంది. ఇది నోట్ లేదా కాయిన్ రూపంలో ఉండదు. పూర్తిగా డిజిటల్ ఫార్మాట్లోనే ఉంటుంది. త్వరలోనే పైలట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెడతారని తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం అంటే ఏప్రిల్‌లోనే ప్రాజెక్టు ఆరంభం అవుతుందని ఆర్‌బీఐ అధికారులు పరోక్షంగా సూచిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక బ్యాంకింగ్, ఆర్థిక సదస్సుల్లో ఆర్‌బీఐ అధికారులు దీని గురించి గతంలో చర్చించారు. తాజాగా ఈ డిజిటల్ రూపాయి బ్లాక్‌చైన్ సాంకేతికతతో వస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Also Read: Budget 2022, Digital Rupee: బ్లాక్‌చైన్‌తో డిజిటల్ రూపాయి! క్రిప్టో కరెన్సీకి చుక్కలేనా?