Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Andhra Pradesh News | పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు.

Palnadu Crime News | అమరావతి : పల్నాడు జిల్లా, ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా విషాదం..
పల్నాడు జిల్లాలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్ల మండలంలోని బొల్లవరంలో కాలవ కట్టపై ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిరపకోతలకు వెళ్లారు. పని ముగించుకుని సాయంత్రం గ్రామానికి తిరిగి గ్రామానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో చక్కెర మాధవి( 30) తేనెపల్లి పద్మావతి (45 ), మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 25 వరకు మహిళలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మహిళా కూలీల మృతిపై మంత్రి విచారం
ట్రాక్టర్ ప్రమాదంపై ఏపీ రవాణాశాఖ మంత్రి ఎం రామ్‌ప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం తీవ్రంగా శ్రమించే మహిళా కూలీల మృతిచెందడం బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

