Paytm: భారీగా తగ్గిన పేటీఎం నష్టం, 52% పెరిగిన ఆదాయం
కంపెనీ చెల్లింపుల సేవల ఆదాయం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,467 కోట్లుగా నమోదైంది.
Paytm Q4 Results: 2022-23 చివరి త్రైమాసికంలో, ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (one97 communications) నష్టం గణనీయంగా తగ్గింది. ఏకీకృత నష్టం 2021-22 మార్చి త్రైమాసికంలోని రూ. 763 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 168 కోట్లకు తగ్గింది. అదే సమయంలో ఆదాయం 52 శాతం పెరిగింది, రూ. 2,335 కోట్లకు చేరింది.
2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో పేటీఎం నికర నష్టం (paytm losses in FY23) రూ. 1,776.50 కోట్లకు తగ్గింది, 2021-22లో ఈ నష్టం రూ. 2,396.40 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ. 4,974.20 కోట్ల నుంచి 60 శాతం పెరిగి రూ. 7,990.30 కోట్లకు పెరిగింది.
చెల్లింపుల సేవల ఆదాయంలో మెరుగుదల
FY23 మార్చి త్రైమాసికంలో కంపెనీ చెల్లింపుల సేవల ఆదాయం (Paytm Payment Service Revenue) ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,467 కోట్లుగా నమోదైంది.
2023 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో చెల్లింపుల సేవల్లో మెరుగుదల సాధించినట్లు, ఎక్సేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం వెల్లడించింది. నికర చెల్లింపు మార్జిన్ సంవత్సరానికి 158 శాతం పెరిగి రూ. 687 కోట్లకు చేరుకుందని, అంతకుముందు సంవత్సరంలో నికర చెల్లింపు మార్జిన్ రూ. 554 కోట్లుగా ఉందని వెల్లడించింది. UPI మినహాయిస్తే ఈ పెరుగుదల 107 శాతం. మొత్తం FY23లో, పేటీఎం నికర చెల్లింపు మార్జిన్ 2.9 రెట్లు పెరిగి రూ. 1,970 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
40 శాతం పెరిగిన GMV
2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పేటీఎం GMV (Gross merchandise value) 40 శాతం పెరిగి రూ. 3.62 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చి 2023 నాటికి 6.8 మిలియన్ల వ్యాపారులు సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లింపులు చేయడంతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ఆదాయం కూడా పెరిగింది.
పేటీఎం రుణ వ్యాపారంలోనూ గణనీయమైన వృద్ధి కనిపించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ 1.2 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. మొత్తం రుణ విలువ 253 శాతం పెరిగి రూ. 12,554 కోట్లకు చేరుకుంది. 2023 మార్చి వరకు, 95 లక్షల మంది రుణాలు తీసుకున్నారని ఈ కంపెనీ తెలిపింది.
గత త్రైమాసికాల్లోని UPI ప్రోత్సాహకాలను మినహాయించి, FY23 నాలుగో త్రైమాసికంలో లైక్-ఫర్-లైక్ (Like-for-like) మార్జిన్ 35 శాతం నుంచి 52 శాతానికి పెరిగిందని కంపెనీ తెలిపింది.
శుక్రవారం ట్రేడ్‌లో (05 మే 2023) ఈ కంపెనీ షేర్లు 3.06% లేదా రూ. 20.55 లాభంతో రూ. 691.40 వద్ద ముగిశాయి. గత 5 ట్రేడింగ్ రోజుల్లో ఈ స్టాక్ 7 శాతం పైగా పెరిగింది. స్టాక్ 52 వారాల గరిష్టం రూ. 844.70 కాగా, 52 వారాల కనిష్టం రూ. 438.35.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.