Pakistan Economy: రూపాయి కూడా ఇవ్వని IMF - దివాలా అంచున పాక్
పాకిస్థాన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
Pakistan Economy: పాకిస్థాన్ దివాలా అంచున ఉంది. క్లిష్ట పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తెచ్చేందుకు IMF నుంచి బెయిలౌట్ ఫండ్‌ను (bailout fund) పాక్ కోరింది. కానీ, కొత్త నిధుల జారీకి అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) అంగీకరించలేదు. పాకిస్థాన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మధ్య జరిగిన చర్చలు విఫలమైనట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
దేశం దివాలా (Bankruptcy) తీయకుండా ఉండేందుకు త్వరలోనే ఒప్పందం ఖరారు చేసుకుంటామని పాకిస్థాన్ ఆర్థిక శాఖ కార్యదర్శి హమీద్ షేక్ వెల్లడించారు.
పాక్ న్యూస్ ఛానల్ జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. బెయిలౌట్ ప్యాకేజ్ పొందేందుకు అవసరమైన చర్యలపై ఇప్పటికే IMFతో చర్చించామని ఆర్థిక కార్యదర్శి హమీద్ షేక్ చెప్పారు. త్వరలో కొన్ని కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఇంకా కొన్ని అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ పాకిస్థాన్ అధికారిక టీవీ ఛానెల్ పేర్కొంది.
IMF నిధులు ఎందుకు ఇవ్వలేదు?
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రతినిధి బృందం గత వారమే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. బెయిలౌట్ ఫండ్‌కు సంబంధించి ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎందుకంటే, పాకిస్తాన్ ఇప్పటికే IMF నుండి బెయిలౌట్ ఫండ్ తీసుకుంది. ఆ రుణం తాలూకు వాయిదా చెల్లింపులు నెలల తరబడి నిలిచిపోయాయి. దీనికి తోడు, కొత్తగా బెయిలౌట్ నిధులు ఇవ్వడానికి IMF "చాలా కఠినమైన" షరతులు విధించింది. పాక్ అధికారులు సమర్పించిన ఆర్థిక గణాంకాలు IMF బృందాన్ని సంతృప్తి పరచలేకపోయాయి. అందుకే, IMF బెయిలౌట్ ఫండ్ పాక్‌కు దక్కలేదు. చర్చలు ఫలిస్తే, IMF నుంచి పాకిస్తాన్‌కు 1.2 బిలియన్ డాలర్లు దక్కేవి.
అయితే, IMF షరతులు అంగీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. తన మిత్ర దేశాలు చైనా, సౌదీ అరేబియా నుంచి కూడా ఆయన సాయాన్ని అర్థించారు.
170 మిలియన్ డాలర్ల ఫారెక్స్ నష్టం
దేశంలో, గత శుక్రవారం (03 ఫిబ్రవరి 2023) నాటికి కేవలం 2.9 బిలియన్ డాలర్లుగా ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు వారం రోజుల్లోనే 170 మిలియన్ డాలర్ల మేర పడిపోయాయని వెల్లడిస్తూ, ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ గురువారం (09 ఫిబ్రవరి 2023) కొత్త గణాంకాలను విడుదల చేసింది. ఇది కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. త్వరగా సరైన సాయం పొందలేకపోతే, దివాలా దేశంగా ప్రకటించడం తప్ప పాక్‌కు మరో దారి ఉండదు.
ఇటీవల, అంతర్జాతీయ థింక్ ట్యాంక్ జియో-పొలిటిక్ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. 1947లో పాకిస్తాన్ తర్వాత ఎప్పుడూ లేనంత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది. జియో-పొలిటిక్ రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్తాన్ ఇప్పటివరకు IMF నుంచి 14 రుణాలు తీసుకుంది, వాటిలో ఏదీ పూర్తిగా తిరిగి చెల్లించలేదు. దీనిని బట్టి, IMF నుంచి బెయిలౌట్ ఫండ్ దక్కించుకుని ప్రస్తుత విపత్కర ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడగల పాకిస్థాన్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాక్‌కు అత్యంత మిత్ర దేశాలైన చైనా లేదా సౌదీ అరేబియా త్వరలో పాకిస్తాన్‌కు సహాయం చేయకపోతే, ఆ దేశం భారీ విపత్తును ఎదుర్కొంటుంది.
డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ ఇటీవల 12 శాతం క్షీణించింది. ప్రస్తుతం 1 డాలర్ 250 పాకిస్థాన్ రూపాయలకు సమానం. ఈ తీవ్ర ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 35 పెంచింది. గతంలో ఎన్నడూలేని పొదుపు చర్యలను పాటిస్తోంది. ఆ దేశంలో ఆహార పదార్థాల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఈ రేట్ల దగ్గర కొనడానికి ధనవంతులు కూడా భయపడుతున్నారంటే ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆకలితో పస్తులుంటున్నారు. ఇదే అదనుగా పాకిస్థాన్‌లో వేర్పాటువాద గ్రూపులు శక్తిమంతంగా మారాయి.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో, పాక్ అధికారులు ఆర్థిక వృద్ధి అంచనాను భారీగా సవరించారు. వారి వాస్తవ జీడీపీ అంచనా 5 శాతానికి బదులుగా 1.5 శాతం నుంచి 2 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కూడా ఈ ఆర్థిక సంవత్సరం సగటు అయిన 12.5 శాతం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 29 శాతానికి పెరుగుతుందని అంచనా.