Budget 2025: మ్యూచువల్ ఫండ్స్‌లో మళ్లీ ఇండెక్సేషన్ బెనిఫిట్! - మనకు ఏంటి లాభం?
Capital Gain Tax: డెట్ ఫండ్స్ మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని 2023లో రద్దు చేయగా, దానిని తిరిగి ప్రవేశపెట్టాలని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
Union Budget 2025 Expectations: 2025-26 ఆర్థిక సంవత్సరం (FY 2025-26) కోసం కేంద్ర బడ్జెట్‌ను, 01 ఫిబ్రవరి 2025న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో, 'అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా' (AMFI), మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ తరపున కొన్ని డిమాండ్లను తెరపైకి తెచ్చింది. ఈ డిమాండ్లలో ముఖ్యమైనది 'డెట్ మ్యూచువల్ ఫండ్స్'(Debt Mutual Funds)పై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనాలను (Indexation Benefit on LTCG) పునఃప్రారంభించడం.
ఇండెక్సేషన్ ప్రయోజనం ఎవరి కోసం?
2023 బడ్జెట్‌లో, డెట్ ఫండ్ల మూలధన లాభాల్లో మార్పులు చేసిన భారత ప్రభుత్వం, ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను రద్దు చేసింది. కొత్త నియమం ప్రకారం, డెట్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులపై 31 మార్చి 2023 వరకు ఇండెక్సేషన్ ప్రయోజనం అందుబాటులో ఉంది, 01 ఏప్రిల్ 2024 నుంచి అది రద్దయింది.
ఇండెక్సేషన్ బెనిఫిట్ అమల్లో ఉన్నప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులపై చాలా భారం తగ్గింది. డెట్ ఫండ్‌లను మూడేళ్ల లోపు విక్రయిస్తే వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG)పై పన్ను చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇండెక్సేషన్ ప్రయోజనాలను పొందడం ద్వారా పన్ను బాధ్యత తగ్గుతుంది. మూలధన లాభాలపై ద్రవ్యోల్బణం (Inflation) ప్రభావాన్ని ఇండెక్సేషన్ కింద పరిగణిస్తారు కాబట్టి, మూలధన లాభాల్లో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని సర్దుబాటు చేసే వాళ్లు, తద్వారా చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గేది.
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు రూ.3,800 పెరిగిన పసిడి రేటు - మీ ఏరియాలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!
కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధన ప్రకారం, పెట్టుబడిదారుల ఆదాయానికి డెట్ ఫండ్స్ మూలధన లాభాలు యాడ్ అవుతాయి. వర్తించే పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తోంది, ఇది పెట్టుబడిదారులకు అదనపు భారంగా మారింది. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ మళ్లీ ప్రారంభమైతే, డెట్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుంది.
1 సంవత్సరానికి పైగా ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను అమ్మితే వచ్చే లాభాలపై 12.5 శాతం పన్నుతో సరిపెట్టాలని ఆంఫీ (AMFI) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇలా జరిగితే, డెట్ ఫండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తుంది.
మరికొన్ని డిమాండ్లు
ఆంఫీ ఇతర డిమాండ్లలో... మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చెల్లించే డివిడెండ్‌లపై పన్ను మినహాయింపు (TDS) పరిమితిని రూ. 5,000 నుంచి రూ. 50,000కి పెంచడం; ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ కోసం మునుపటి STT రేట్లను పునరుద్ధరించడం; సెబి (SEBI)లో రిజిస్టర్ అయిన మ్యూచువల్ ఫండ్స్ NPS మాదిరిగానే పెన్షన్-ఆధారిత పథకాలను (Pension-Oriented Schemes) ప్రారంభించేందుకు అనుమతించడం వంటివి ఉన్నాయి.
మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్ ఫైల్ చేయడానికి CA అవసరం లేదు! - సర్కారు చేస్తోంది చాలా మార్పులు